బనశంకరి: పెట్రోల్, డీజిల్ ధర పెంపుతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారుతోందని సీఎం సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని ఖండిస్తూ ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని భావించినట్లే పెంచారని మండిపడ్డారు. కానీ కర్ణాటకలో ఇతర రాష్ట్రాల కంటే గణనీయంగా తక్కువగా ఉండే పెట్రోల్ ధరను పెంచడంపై బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రి కాగానే అనేక సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారన్నారు. ధరల పెంపుతో ప్రజలపై వ్యక్తిగతంగా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ప్రత్యేకంగా కార్మికులు, రైతులు, పేదలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. కేంద్రప్రభుత్వం ధరల పెంపును రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. మోదీ పాలన ప్రారంభం కాక ముందు రూ.413గా ఉన్న గృహవినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1000కు చేరుకుందన్నారు. పెట్రో ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరగడానికి కారణం అవుతుందన్నారు. ఎల్‌పీజీ సరఫరాలో వ్యత్యాసం మధ్య ధరల పెంపుతో జనజీవనం అస్తవ్యస్తమైందన్నారు. నీట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్‌కు ఇబ్బందికరంగా మారిందన్నారు. కర్ణాటకలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభించడంపై స్పందించిన సిద్దరామయ్య రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం కల్పించిందన్నారు.
కేంద్రం తీరుపై సీఎం సిద్దరామయ్య ఆగ్రహం


