రాయచూరు రూరల్: వేసవి తీవ్రత, వర్షాభావంతో కర్ణాటకలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఎండల తీవ్రతకు ఉత్తర, కళ్యాణ కర్ణాటకలో తాగునీటి ఎద్దడి నెలకొంది. చెరువులు, తాగునీటి కుంటలు ఎండిపోతున్నాయి. తాగునీటి కోసం ప్రజలు బోర్లను ఆశ్రయిస్తున్నారు. విజయపుర, బాగల్‌కోటె జిల్లాల సరిహద్దులో ఉన్న ఆల్మట్టి డ్యాంలో అనుకున్నంత మేర నీరు లభ్యత లేదు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జలాశయంలో నీటి లభ్యత గణనీయంగా పడిపోయింది. ఆల్మట్టి డ్యాం 519.60 మీటర్ల సముద్ర మట్టం వద్ద 123.08 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం 52.42 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మే, జూన్ వరకు ఆల్మట్టి జలాశయం నుంచి విజయపుర, బాగల్‌కోటె, యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాలో తాగునీటి పథకాలకు ఇబ్బందులు తప్పవు. సిరవార తాలూకా ప్రజలు అత్తనూరు చెరువు నీటిని తెచ్చుకుంటున్నారు. మాన్వి తాలూకా కల్లూరులో కిలోమీటర్ దూరం వెళ్లి తోపుడు బండ్లపై తాగునీరు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. తాగునీటి సమస్యలు పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. నీటి సమస్యలను పరిష్కరించే వారు కరువయ్యారు. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ వర్షాభావంతో నీటి సమస్య అధికమైంది. ఆల్మట్టి జలాశయానికి కోయ్నా జలాశయం నుంచి తాగునీటి కోసం రెండు టీఎంసీల నీరు విడుదల చేయాలని అధికారులు లేఖ రాశారు. అయితే నేటికీ స్పందన లేదు. కోయ్నా డ్యాంలో 42 టీఎంసీలు, వారణాసి డ్యాంలో 14 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. రెండు టీఎంసీల నీరు వదిలేందుకు మహారాష్ట్ర సర్కార్ విముఖత చూపుతోంది.
ఉత్తర, కళ్యాణ కర్ణాటకలో
గ్రామాలకు తాగునీటి గండం
కృష్ణా తీరంలో తీవ్రమైన సమస్య


