నాసిరకం భోజనంపై భగ్గుమన్న విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

నాసిరకం భోజనంపై భగ్గుమన్న విద్యార్థులు

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

బళ్లారి అర్బన్‌: విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి వసతి గృహాల్లో నాసిరకమైన భోజనం పెట్టడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. హాస్టల్‌లో పారిశుధ్యం, తాగునీరు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఏఐడీఎస్‌ఓ బళ్లారి జిల్లా సమితి ఆధ్వర్యంలో సమాజ సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి అజయ్‌ కామంత్‌ మాట్లాడుతూ.. బళ్లారి, విజయనగర తదితర జిల్లాల నుంచి ఉన్నత విద్య కోసం వీఎస్‌కే విశ్వవిద్యాలయానికి చేరుతున్న పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లో 450 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికి వారికి అందిస్తున్న ఆహారం, నాసిరకంగా ఉందని తెలిపారు. ఆహారం సరిగా లేకపోవడంతో విద్యార్థులు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. హాస్టల్లో పారిశుధ్యం పూర్తిగా దెబ్బతినగా.. మరుగుదొడ్లు, వంట గదులు శుభ్రంగా లేవన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. కూరగాయలు, పప్పు లేకుండా, సాంబార్‌ను నాసిరకం నూనెతో తయారు చేసి భోజనం అందిస్తున్నారని ఆరోపించారు. వారానికి ఒక్కసారి కూడా చికెన్‌ ఇవ్వడం లేదన్నారు. సంక్షేమ శాఖ అధికారులు ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. అనంతరం సమాజ సంక్షేమ శాఖ ఉపనిర్దేశకులు చిదానంద, జిల్లా అధికారి, సంక్షేమ శాఖ కమిషనర్‌, సంబంధించిన మంత్రులకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఐడీఎస్‌ఓ జిల్లా అధ్యక్షుడు ఈరణ్ణ, కార్యదర్శి కే.మంజునాథ్‌, ఎం.శాంతి, నిహారిక, సమీర్‌, వీఎస్కే హాస్టల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement