సాక్షి, బళ్లారి: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం లోక్‌సభ సభ్యుడు తుకారాం, బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు తదితరులు విలేకరులతో మాట్లాడారు. గతంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఇప్పుడు ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి ఉంటుందా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక లీటర్‌పై ఏకంగా ఒకేసారి మూడు రూపాయలు పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కూలీలు కూడా పనులు చేసేందుకు ద్విచక్ర వాహనాల్లో వెళ్తుంటారని.. ఇలాంటి సందర్భంలో పెట్రోలు ధరలు పెంచడం సరికాదని మండిపడ్డారు. కూలీల పొట్ట కొడుతున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు.. ఇష్టానుసారంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంలో అర్థం లేదన్నారు. పెంచిన ధరలు తగ్గించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


