హిజాబ్‌ మినహాయింపుపై హీట్‌ | - | Sakshi
Sakshi News home page

హిజాబ్‌ మినహాయింపుపై హీట్‌

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం విద్యార్థుల సంక్షేమం కోసమే విద్యాలయాల్లో హిజాబ్‌ ధారణకు అనుమతులిచ్చినట్లు విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. అయన గురువారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. విద్య, మతంపై రాజకీయాలు చేయటం సరికాదన్నారు. హిజాబ్‌ మీదే మాట్లాడుతున్నారు, ఇటీవల నీట్‌ పరీక్షల్లో జంధ్యాన్ని తొలగించారు.. దానిపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి ప్రశ్నించారు. నీట్‌ పరీక్షల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా మీకు కనిపించటం లేదా అని మండిపడ్డారు. రాజస్థాన్‌, గుజరాత్‌లో నీట్‌ లీకేజీలో దొరికిన వారందరూ బీజేపీ నాయకులని ఆరోపించారు.

బుజ్జగించడానికే: బీజేపీ

శివాజీనగర: పార్టీ సీనియర్‌ నాయకులు ఆర్‌.అశోక్‌, వీ.సునీల్‌కుమార్‌, బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ తదితరులు సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. మైనారిటీల మెప్పు కోసం విద్యాసంస్థల్లో హిజాబ్‌ధారణకు అవకాశం ఇచ్చారన్నారు. కేసరి శాలువాను ధరించరాదని చెప్పడం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికే అని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి కన్నడిగులు తగిన గుణపాఠం చెప్పటం తథ్యమన్నారు. ఓటు బ్యాంకును కాపాడుకోవటానికి హిజాబ్‌ అంశాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు.

నిరసనలు

మరోవైపు పలు హిందూ సంస్థలు గురువారం నిరసలను నిర్వహించాయి. హుబ్లీలో శ్రీరామసేన కార్యకర్తలు సీఎం తదితరుల చిత్రాలను తగులబెట్టారు. హిజాబ్‌పై బీజేపీ నాయకులు నిరసనలను చేపట్టాలని నిర్ణయించారు.

బీజేపీ నిరసనలపై విద్యా మంత్రి ఆగ్రహం

కొత్తగా అయితే వద్దు: సీఎం

మైసూరు: విద్యార్థులు హిజాబ్‌, జంధ్యం, మొలతాడు, రుద్రాక్ష ధరించవచ్చని, ఇప్పటికే ఉన్న మతపర వస్త్రధారణను అనుసరించవచ్చని, కొత్తగా చేయకూడదని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. గురువారం మైసూరులో తమ నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. డీజిల్‌, పెట్రోల్‌ వాడకాన్ని తగ్గించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలు సరికాదని సిద్దరామయ్య అన్నారు. మోదీ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించడం కేవలం తాత్కాలిక చర్యేనని అన్నారు. అలా కాకుండా పెట్రోల్‌, డీజిల్‌ను ఉత్పత్తి చేసే దేశాలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావడం మేలని చెప్పారు. త్వరలో రాష్ట్ర కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరణ చేసే ఉద్దేశం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్‌ పరీక్షను సక్రమంగా జరపలేదని, దీంతో విద్యార్థులకు అన్యాయం జరిగిందని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement