శివమొగ్గ: తీవ్రమైన ఎండ, ఉక్కబోతల మధ్య ఓ మోస్తరు వర్షాలతో పలు జిల్లాల్లో ప్రజలు ఉపశమనం చెందారు. బుధవారం సాయంత్రం నుంచి శివమొగ్గ జిల్లాలో సొరబ పట్టణంతో సహా తాలూకాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది, గాలీవానకు చెట్లు, కరెంటు స్తంభాలు కూలి నష్టం వాటిల్లింది. సొరబలోని మురుగ మఠం వద్ద నిర్మాణంలో ఉన్న సభా మందిరం పైకప్పు పలకలు గాలి తీవ్రతకు ఎగిరిపోవడంతో భవనం దెబ్బతింది.
చంద్రగుత్తి రోడ్డులోని కరడిగేరిలో చెట్టు పడి విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఉద్రి–సిగెహళ్లి రహదారిపై చెట్టు కూలి వాహన సంచారం నిలిచిపోయింది. విద్యుత్, అటవీ శాఖ సిబ్బంది చెట్లను తొలగించే పనిలో ఉన్నారు. కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో అనేక ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి కరెంటు పోయి ప్రజలు అవస్థలు పడ్డారు.
గురువారం సాయంత్రం మైసూరు నగరంలో ఆకస్మికంగా వర్షం కురవడంతో చల్లదనం నెలకొంది. ప్యాలెస్, జేసీ సర్కిల్ తదితర ప్రాంతాల్లో వాననీరు నిలిచిపోయింది.
శివమొగ్గ జిల్లా, మైసూరులో వానలు


