నీట్‌ పాపం కేంద్ర సర్కారుదే | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పాపం కేంద్ర సర్కారుదే

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

చిక్కబళ్లాపురం: ఇటీవల వైద్య కోర్సుల ప్రవేశానికి దేశమంతటా జరిగిన నీట్‌–యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం రాజస్థాన్‌లో లీక్‌ కావడంతో పరీక్షను రద్దు చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌, వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రంలో నిరసనలను కొనసాగిస్తున్నాయి. ఈ లీకేజీకి కేంద్ర ప్రభుత్వానిదే జవాబుదారీ అని జిల్లా యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు చిక్కబళ్లాపురం నగరంలోని బీజేపీ ఆఫీసును ముట్టడించడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఆఫీసు ముందు కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంతోమంది ప్రతిభావంత విద్యార్థులు రాత్రి పగలూ తేడా లేకుండా చదువుకుని పరీక్షరాస్తే, దానిని రద్దు చేశారని దుయ్యబట్టారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా కారణమని ఆరోపించారు. నగరంలో మరోచోట స్థానిక బీజేపీ ఎంపీ కె.సుధాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు హయాంలో పేపర్లు లీక్‌ కాలేదా?, పరీక్షలపై రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు.

పార్లమెంటులో ప్రశ్నించాలి

తుమకూరు: నీట్‌ పరీక్ష నిర్వహణలో వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. బీజీఎస్‌ సర్కిల్‌లో ఆందోళన చేపట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీలు పార్లమెంట్‌లో ప్రశ్నించాలన్నారు. బీజేపీ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కలబుర్గిలో కలెక్టరేట్‌ ముందు కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి.

రాష్ట్రంలో పలుచోట్ల కాంగ్రెస్‌, వామపక్ష విద్యార్థి సంఘాల ధర్నాలు

Advertisement
 
Advertisement
Advertisement