బొమ్మనహళ్లి: కొడగు జిల్లాలోని సోమవారపేట వద్ద ఐగూరులో ముత్తప్ప దేవుని కోల సేవలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ఉదయం గణపతి హోమంతో వేడుక ప్రారంభమైంది. సాయంత్రం గుళిగప్ప ఆలయం నుంచి ఒక భారీ ఊరేగింపు ప్రారంభమైంది. ముత్తప్పన్, తిరువప్పన్, కుట్టిచాతన్, గుళిగన్ వెల్లటం సేవలు స్థానిక సంప్రదాయ రీతిలో జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది భక్తులు వేడుకలను వీక్షించారు.
కాలువలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల గల్లంతు
యశవంతపుర: ఈతకెళ్లి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు జల సమాధి అయిన విషాద ఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకాలో జరిగింది. వివరాలు.. దావణగెరెలోని బిఐఇటీ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న కొందరు విద్యార్థులు గురువారం మధ్యాహ్నం విహారయాత్రకు సమీపంలోని భద్రా కుడికాలువకు వచ్చారు. కాలువలో ఈత కొడుతుండగా, వివేక్, మానస అనే ఇద్దరు లోతైన చోట గల్లంతయ్యారు. మిగిలిన విద్యార్థులు సాయం కోసం కేకలు వేసిన ఫలితం లేకపోయింది. స్థానికులు, ఫైర్ సిబ్బంది వెతగ్గా వివేక్ మృతదేహం లభించింది. మానస కోసం గాలిస్తున్నారు. బసవపట్టణ పోలీసులు ఘటన స్థలంను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాలేజీ విద్యార్థులు, కుటుంబసభ్యులు తీవ్రంగా దుఃఖించారు.
బైక్‌ను ఢీకొని లాక్కెళ్లిన కారు
● తల్లి మృతి, కుమారునికి గాయాలు
తుమకూరు: తిపటూరు నుంచి సూగూరుకు వెళ్తున్న కారు హేమావతి కాలువ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టింది. బైక్ వెనుక కూర్చున్న వృద్ధురాలు తల పగిలి మరణించింది. మృతురాలు రామక్క (60). ఆమె కుమారుడు సతీష్‌తో కలిసి తిపటూరు నుంచి సుగూర్‌కు బైక్‌పై వెళ్తుండగా, వెనుక వేగంగా వచ్చిన కారు ఢీకొంది. అలాగే బైక్‌ను, రామక్కను సుమారు 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ తల ఛిద్రమై చనిపోగా, కుమారుని తలకు గాయాలై రోడ్డు పక్కన పడిపోయాడు. కానీ కారు ఆపకుండా వెళ్లిపోయింది. ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని, కారును అక్కడికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నోనవినకెరె పోలీసులు, ప్రజలను శాంతింపజేసి, మహిళ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నోనవినకెరె పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారా, లేక కారు నడిపినవారిపై నామమాత్రంగా కేసులు పెట్టి వదిలేస్తారా? అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.
గవర్నర్ కాన్వాయ్ కుదింపు
శివాజీనగర: దేశంలో ఇంధన పొదుపును పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు బెంగళూరులో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తన కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించారు. గవర్నర్‌కు బెదిరింపులు ఉన్నాయని ఆయనకు భారీ భద్రత ఉంటోంది. సీఐఎస్‌ఎఫ్ భద్రతా వాహనాలను గణనీయంగా తగ్గించారు.


