● బంగారుపేట తాలూకాలో కలకలం
కోలారు: జిల్లాలోని బంగారుపేట తాలూకా తమిళనాడు సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో తుపాకీ తూటాలు దొరికాయి. ఎస్‌ఎల్‌ఆర్ లేదా మిషన్ గన్‌లకు ఉపయోగించే 214 బుల్లెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాసరమల్ల బ్రిడ్జి వద్ద అపరిచిత వ్యక్తులు ఈ బుల్లెట్‌లను పడేసి పోయినట్లు తెలుస్తోంది. కామసముద్రం పోలీసులు వాటిని పరిశీలించగా పలు వివరాలు తెలిశాయి. 1969లో మహారాష్ట్రలో తయారు చేసినట్లు గుర్తించారు. ఇందులో 7.6 ఎంఎం మోడల్ గుండ్లు ఉన్నాయి. 135 లైవ్ తూటాలు, 85 ఖాళీ తూటాలు లభించాయి. ఇవి ఆర్మీలో వాడే తూటాలని అనుమానం. కొద్దినెలల క్రితమే ఇక్కడ వీటిని పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలో ఇంత భారీమొత్తంలో బుల్లెట్‌లు లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముమ్మరంగా విచారణ చేపట్టారు.


