సాక్షి,బళ్లారి: ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఒక ఉడుతను మనకెందులే అని వదిలివెళ్లకుండా దానిని పట్టుకుని, ఇంటికి తీసుకెళ్లి రాత్రింబగళ్లు కంటికి రెప్పలా చూసుకుని ప్రాణాలు రక్షించి ఉడుతకే సేవ చేస్తున్న ఓ చిన్నారిని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్న ఉదంతం జిల్లాలోని సండూరు తాలూకా నరసాపురలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నారి సాన్వి ఒక ఉడుతకు ఆప్త రక్షకురాలు, స్నేహితురాలు, ప్రాణదాతగా మారింది. నరసాపుర ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చిన్నారి సాన్వి గత నెల మొదటి వారంలో పరీక్షలు ముగిసి, వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఆనందంతో ఇంటికి వెళుతుండగా పాఠశాల ఆవరణలో ఒక చిన్న ఉడుత ఏదో ప్రమాదంలో పడి కొట్టుమిట్టాడుతోంది. తోటి విద్యార్థులు చూసీచూడనట్లు వెళ్లిపోయారు. కొన ఊపిరితో అల్లాడిపోతున్న ఆ ఉడుతను సాన్వి చూసింది. అందరి మాదిరిగా వదిలి వెళ్లిపోకుండా దాని తల్లి వస్తుందేమోనని చాలా సేపు అక్కడే వేచి చూసింది. అయితే దాని తల్లి రాలేదు. ఉడుతలో కూడా కదలిక లేదు. అలాగే వదిలివెళితే ఉడుత ప్రాణం పోతుందని భావించిన సాన్వి తన చేతుల్లోకి తీసుకుని ఇంటికి తీసుకెళ్లింది.
అష్టకష్టాలతో ఉడుతకు సేవలు
ఆరోజు నుంచి ఉడుతను కాపాడే పనిలో సాన్వి అష్టకష్టాలు పడింది. ఉడుతను ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు భయపడ్డారు. అడవిలో చెట్లు, గుట్టల మధ్య పెరిగే ఈ పిల్ల ప్రాణి ఇంట్లో పెరగడం కష్టంగా ఉంటుందని మందలించారు. అయినా వెనక్కి తగ్గకుండా దాని సంరక్షణలో పడింది. ఉడుతపై ఏర్పడిన ప్రేమతో దానిని పట్టుదలగా సాకడంపై దృష్టి సారించింది. చివరకు కుటుంబంలో అందరూ ఒప్పుకోవడంతో సాన్వి సోదరుడు గురు కూడా తోడ్పాటునందించాడు. ఎట్టకేలకు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఉడుతను ప్రాణాలతో రక్షించారు. ఇంట్లో వారందరూ దానిని ప్రేమతో చూస్తూ దానికి రాము అని పేరు పెట్టారు. సాన్వికి బాగా అలవాటు కావడంతో పాటు రాము అని పిలిస్తే చెవులు నిక్కపెట్టి చూస్తూ స్పందిస్తుంది. ముద్దు ముద్దుగా కనిపిస్తుండటంతో ఇంట్లో అల్లారుముద్దుగా పెరుగుతోంది. సాన్వి భుజాల మీదకు ఎగిరి అల్లరి చేస్తుండటంతో పాటు ఆ ఇంట్లో ఒక అందమైన ప్రాణిగా ఎదుగుతోంది. రోజు రోజుకు చలాకీగా మారుతుండటంతో నరసాపుర గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు కూడా ఉడుతను చూసి సాన్వి సేవలకు శభాష్ అంటున్నారు.
అడవిలో పెరిగే ప్రాణికి ఇంట్లో ఆశ్రయం
ఈ సందర్భంగా సాన్వితో పాటు కుటుంబసభ్యులు మాట్లాడుతూ ఉడుతను ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఉడుత ఏం తింటుందో అర్థం కాలేదన్నారు. ఆవుపాలను చిన్న మూతలో పోసి తాగించగా, అది తాగడంతో ఆవు పాలను పోసి ప్రాణాలను కాపాడామన్నారు. అనంతరం బిస్కెట్లు, కొబ్బరి, టమాటాలు, మామిడి పండ్లు, పుచ్చకాయలు తదితర శాకాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఆరోగ్యంగా ఉందని, ఎగిరి గంతులు వేస్తూ తమ మధ్య బాగా తిరుగుతోందన్నారు. రెండురోజులకొకసారి బాగా స్నానం చేయిస్తామన్నారు. ప్రస్తుతం ఇంట్లో అల్లారుముద్దుగా తిరుగుతూ తమ కుటుంబ సభ్యుడుగా మారిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. తాము ఏ ఊరికై నా వెళ్లినా దానిని వెంట తీసుకెళతామన్నారు. కొద్దిసేపు ఇంట్లో కనిపించకపోతే వెదుకుతామని, కాసేపటికి అదే తిరిగి వస్తుందన్నారు.
ఉడుతను ఎక్కడా బంధించలేదు
అడవిలో పెరిగే ప్రాణి కాబట్టి తమ వద్ద ఉంటుందో లేదో అని భావించామన్నారు. అయితే తమను వదిలివెళ్లడం లేదన్నారు. తమ వద్దనే ఉంటోందని, దానిని బోనులో లేదా ఎక్కడైనా ఇంట్లో బంధించలేదన్నారు. సహజంగా ఎక్కడబడితే అక్కడ తిరిగేందుకు వదిలివేశామని, అయితే ఇంట్లో తిరుగుతూ, బయటకు వెళ్లి మళ్లీ ఇంట్లోకి వచ్చి తమ భుజాల మీదకు ఎక్కి ఎగురుతుంటుందన్నారు. ఉడుతకు తమకు ఏదో జన్మలో బంధం ఉండటం వల్లనే తాము సేవ చేసేందుకు అవకాశం లభించిందన్నారు. జంతువులు, పక్షులను మనం ప్రేమతో చూసుకుంటే అవి కూడా మనల్మి ప్రేమగా తమ భాషలో పలకరిస్తుంటాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఉడుతకు ప్రాణం పోసిన పసి చేతులు
బాలిక సాన్వి సేవతో బతికిన చిరు ప్రాణం
పాఠశాల ఆవరణలో దొరికిన
ఉడుతకు ఆసరా
ఉడుతతో అనుబంధంతో
ఇంట్లో కొత్త ఆనందం


