మార్కెట్‌లో శుభ్రత కాపాడండి | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో శుభ్రత కాపాడండి

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

రాయచూరు రూరల్‌: నగరంలోని మార్కెట్‌లో శుభ్రతకు ప్రాధాన్యత కల్పించి పరిసరాలను సంరక్షించాలని స్వచ్ఛత నోడల్‌ అధికారి కృష్ణ శావంతగేర పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఉస్మానియా కాయగూరల మార్కెట్‌ను సందర్శించి విక్రయదారులకు సలహా సూచనలు అందించారు. కుళ్లిన కాయగూరలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పశువులు, కుక్కలు వాటిని చిందర వందర చేస్తాయని, అలా జరగకుండా చూసుకోవాలన్నారు. నగరసభ అధికారులు, సిబ్బంది నిఘా ఉంచి స్వచ్ఛత కాపాడని వారిపై జరిమానా విధించాలని సూచించారు.

గ్యాస్‌ సిలిండర్ల

ధరాభారం తగదు

హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లను అక్రమంగా అదనపు ధరలకు అమ్మడాన్ని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు గురువారం తహసీల్దార్‌ కవితకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఇరాన్‌, ఇజ్రాయిల్‌, అమెరికా మధ్య యుద్ధం సాకుతో కొంత మంది గ్యాస్‌ సిలిండర్ల డీలర్లు వినియోగదారుల నుంచి అదనపు డబ్బు వసూలు చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్‌ఎస్‌ బసవరాజ్‌ అన్నారు. గ్యాస్‌ ఏజెన్సీ యజమానులు, కొందరు అధికారుల కుమ్మక్కుతో నడుస్తోన్న ఈ దందాను అరికట్టాలన్నారు. ప్రజలకు సిలిండర్లు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) తాలూకా అధ్యక్షుడు ఎస్‌.జగన్నాథ్‌, దురుగమ్మ, నాగమ్మ, కే.రమేష్‌, ఎం.ఆనంద్‌, పి.చాంద్‌బీ తదితరులు పాల్గొన్నారు.

చెరువుల సంరక్షణకు చర్యలు

రాయచూరు రూరల్‌: నగరంలో పురాతన చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని జిల్లాధికారిణి పూవిత సూచించారు. గురువారం నగరంలోని మావినకెరె చెరువును పరిశీలించి ఆమె మాట్లాడారు. నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో పట్టణాలు, నగరాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రో, ఆనంద రెడ్డి, బసవరాజ్‌లున్నారు.

నలుగురు పోలీసు

అధికారుల బదిలీ

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లాలో నలుగురు పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. సదర్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐగా దాదావలిని నియమిస్తు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పదేళ్ల క్రితం ఎ్‌స్‌ఐగా విధులు నిర్వహించిన పోలీస్‌ స్టేషన్‌లోనే సీఐగా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సదర్‌ బజార్‌ సీఐగా ఉన్న ఉమేష్‌ నారాయణ కాంబ్లేను పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌ సీఐగా ఉన్న మేకా నాగరాజ్‌ను లోకాయుక్తకు బదిలీ చేశారు. దేవదుర్గ గ్రామీణ సీఐగా ఉన్న గుండూరావ్‌ను రాయచూరు సైబర్‌ క్రైంకు బదిలీ చేశారు. లోకాయుక్తలో ఉన్న పుండలీక పత్తార్‌ను దేవదుర్గ గ్రామీణ సీఐగా నియమితులయ్యారు.

15 రోజులైనా తాగునీరు వదలరా?

రాయచూరు రూరల్‌: నగరంలోని మడ్డిపేటెలో 15 రోజుల క్రితం తాగునీటిని వదిలిన తర్వాత నేటికీ వదలక పోవడంతో అధికారుల తీరును నిలదీస్తూ అఖిల భారత జనవాది మహిళా సంఘం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మహిళా సంఘం సంచాలకురాలు సులోచన మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని ఖండించారు. కాలనీవాసులకు తాగునీటిని వదలాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. వరలక్ష్మి, శకుంతల, నాగరత్నలున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement