హొసపేటె: జిల్లాలోని మరియమ్మనహళ్లి ఫిర్కా నందిబండిలో వెట్టిచాకిరీ వ్యవస్థలో చిక్కుకున్న ఒడిశాకు చెందిన 37 మంది కార్మికులను రక్షించారు. బెళగావి జిల్లాకు చెందిన స్పందన అనే స్వచ్ఛంద సంస్థ అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాధికారిణి కవిత మార్గదర్శకత్వంలో సహాయ కమిషనర్ వివేకానంద నందిబండి గ్రామంపై దాడి చేశారు. ఆ సమయంలో కనీస సౌకర్యాలు లేని, కేవలం నాలుగు అడుగుల వెడల్పున్న చిన్న ఇళ్లలో దుస్థితిలో నివసిస్తున్న ఒడిశాలోని బోలాంగిర్, నవరంగ్‌పూర్ జిల్లాలకు చెందిన 10 మంది పిల్లలు, 11 మంది మహిళలు, 16 మంది పురుషులతో సహా మొత్తం 37 మంది కార్మికులకు రక్షణ కల్పించారు.
ఒక్కొక్కరికీ రూ.40 వేల అడ్వాన్స్
ఈ కార్మికులను ఒక్కొక్కరికి రూ.40 వేల అడ్వాన్స్ చెల్లించి ఆరు నెలల క్రితం వారిని ఒడిశా నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. మొదట వారు ఆరు నెలల పాటు పని చేయాలన్న షరతుతో ఇక్కడికి తీసుకువచ్చి చేసిన పనిని బట్టి వారికి జీతం చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ ప్రకారం డబ్బుకోసం వారం మొత్తం కష్టపడి పని చేసినా మొత్తం కుటుంబానికి వారానికి కేవలం రూ.500 మాత్రమే చెల్లిస్తున్నారు. తాము ఆరు నెలల క్రితం వచ్చాం. తమ గడువు ముగిసింది, తాము వెళ్లి పోతామని చెప్పినప్పుడు తమకు బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా చూసేందుకు భద్రతా సిబ్బందిని నియమించారని బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు.
దోషులను కఠినంగా శిక్షిస్తాం
దీనిపై జిల్లాధికారిణి స్పందిస్తూ ఈ ఘటనపై మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దోషులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా యంత్రాంగం కేవలం రక్షించడంతోనే సరిపెట్టుకోకుండా కార్మికులను వారి స్వగ్రామాలకు సురక్షితంగా పంపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. జిల్లాధికారిణి కవిత, జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి స్వయంగా హాజరై వారిని రైలులో స్వగ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా రక్షణ కోసం కార్మికులతో పాటు ఇద్దరు పోలీసులను, రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు అధికారులను కూడా పంపించారు. డీఎస్పీ పీ.మురళీధర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు.
అధికారుల దాడితో ఎట్టకేలకు స్వేచ్ఛ
ఒడిశాకు తిరిగి బయల్దేరిన కార్మికులు


