సాక్షిబళ్లారి: ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ సూచించారు. గురువారం జిల్లాలో రోడ్డు భద్రత, ప్రజల ప్రాణ రక్షణ కోసం పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవగాహన కార్యక్రమం, హెల్మెట్ల పంపిణీ, బైక్ ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు. చట్టాలు ప్రజల రక్షణ కోసమే రూపొందిస్తారని, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని అన్నారు. హెల్మెట్ తప్పనిసరి నిబంధన ఎవరికీ మినహాయింపు కాదని వ్యాఖ్యానించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా జిల్లాలో జరిగిన బైక్ ప్రమాద గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు.
మూడేళ్లలో 462 మంది మృతి
మూడేళ్లలో బైక్ ప్రమాదాల్లో 462 మంది మరణించారని ఎస్పీ అన్నారు. జూన్ 1వ తేదీ నుంచి హెల్మెట్ ధారణను తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. ప్రజలు తమ కుటుంబ సభ్యుల కోసమైనా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. హెల్మెట్‌పై బైక్ ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. సీనియర్ సివిల్ జడ్జి హొసమనె మాట్లాడుతూ ఖరీదైన మొబైల్ ఫోన్లకు ఇచ్చే రక్షణను ప్రజలు తమ ప్రాణాలకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్ స్క్రీన్ పగలకుండా స్క్రీన్ గార్డ్ వేసుకొనే మనం మెదడు, ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ధరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నామన్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని గుర్తు చేశారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్, ఏఎస్పీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ సూచన
హెల్మెట్‌పై జాగృతి ర్యాలీకి శ్రీకారం


