బెంగళూరు.. ఢిల్లీ మాదిరి కాకూడదు
శివాజీనగర: దేశ రాజధాని డిల్లీలోలాగే బెంగళూరు సైతం తీవ్ర వాయు కాలుష్యంతో మరో గ్యాస్ చాంబర్ కాకుండా చూసుకోవాలని, ఇందుకోసం త్వరలోనే నగరంలోని 28 మంది ఎమ్మెల్యేలతో సమావేశం జరుపుతామని అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. గురువారం నగర అధికారులతో ఆయన సమావేశమై, బెంగళూరులో వాయు, జల, శబ్ద కాలుష్యాలు తీవ్రమైనట్లు తెలిపారు. దీనిని అరికట్టడానికి అన్ని పార్టీల ప్రజా ప్రతినిధుల సహకారం అవసరమని అన్నారు. రోడ్ల దుమ్ముతో వాయు నాణ్యత క్షీణిస్తోందని, బెంగళూరు శివార్లలో జీవించడం మేలని వైద్యులు సలహానిస్తున్నారని వాపోయారు. వాయు నాణ్యతను కాపాడాలని తెలిపారు.
ఏక్యూఐ 100 దాటితే అలర్ట్
బెంగళూరులో 11 చోట్ల శాశ్వత, 13 సంచార వాయుమాపన కేంద్రాలు పనిచేస్తున్నాయని, కాలుష్య సమాచారం పక్కాగా సేకరించాలని మంత్రి తెలిపారు. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 100 పాయింట్లు దాటిన చోట అప్రమత్తత ప్రకటించాలని సూచించారు. వాయు కాలుష్యానికి కారణమవుతున్న సంస్థలకు నోటీసులు జారీచేసి నివారణ చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. డీసీఎం డీ.కే.శివకుమార్‌తో, నగర ఎమ్మెల్యేలతో పరిష్కార చర్యలపై త్వరలోనే చర్చిస్తానని చెప్పారు.
వాయు, జల, శబ్ధ కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలి
అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రె


