బాగల్‌కోటెలో ఉద్రిక్తత
శివాజీనగర: శివాజీ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రపైకి దుండగులు రాళ్లు రువ్వటంతో బాగల్‌కోటెలో ఉద్రిక్తత నెలకొనగా, నిషేధాజ్ఞలను జారీ చేశారు. గురువారం రాత్రి శివాజీ భావచిత్రం ఊరేగింపు ఓ ప్రార్థనా మందిరం వద్దకు రాగానే కొందరు దుండగులు రాళ్లు, పాదరక్షలు విసరటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందో తెలియక జనం భీతిల్లారు. ఘటనలో బాగల్‌కోటె ఎస్పీ సిద్ధార్థ గోయల్ తలకు కూడా గాయమైంది. కార్యకర్త ప్రకాశ్ అరకెరెకు గాయం కాగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. రాళ్లు రువ్విన సందర్భంలో ఊరేగింపులో చేరిన యువకులు వాగ్వాదానికి దిగగా, పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. యువకులను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని నియంత్రించారు. రాళ్లు రువ్విన వారు కూరగాయల మార్కెట్‌లో 3 తోపుడు బండ్లకు నిప్పు పెట్టగా పోలీసులు తక్షణమే స్పందించి మంటలను ఆర్పివేశారు.
పరిస్థితి పూర్తిగా అదుపులోకి
ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది. నిషేధాజ్ఞలు జారీ చేసి, ఎవరూ కూడా గుంపుగా చేరకుండా ముందు జాగ్రత్త వహించారు. సభలు, సంబరాలు, ధర్నాలు చేయటాన్ని నిషేధించారు. పాత బాగల్‌కోటె, నవనగర, విద్యాగిరిల్లో బీఎన్‌ఎస్ 163 కింద ఈనెల 24న అర్ధరాత్రి వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని బాగల్‌కోటె ఉప విభాగాధికారి సంతోష్ జాగలాట్కర్ తెలిపారు.
దుండగులను అరెస్ట్ చేయాలి
రాళ్లదాడిని ఖండిస్తూ కొందరు యువకులు రోడ్డుపైనే ధర్నాకు సిద్ధమయ్యారు. రాళ్లు రువ్వినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐజీపీ ఘటనా స్థలానికి రావాలని పట్టుబట్టగా పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి ధర్నా తీవ్ర స్వరూపం దాల్చకుండా చర్యలు తీసుకొన్నారు.
ముతాలిక్ ఖండన: బాగల్‌కోటెలో శివాజీ జయంతి ర్యాలీపైకి రాళ్లు రువ్వటాన్ని శ్రీరామ సేన జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ఖండించారు. ఈ గొడవకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ప్రార్థనా మందిరం ఎదురుగా ర్యాలీ వచ్చినపుడు రాళ్లు, చెప్పులు విసిరారన్నారు. హిందువులపై ఇతర మతస్థుల దాడి జరిగిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జిల్లా ఎస్పీపైకి కూడా రాళ్లు పడ్డాయన్నారు. అయినా రాళ్లు పడలేదని ప్రభుత్వం చెబుతోందని, ఈ ఘటనకు జిహాదీ కుమ్మక్కే కారణమన్నారు.
దుండగులకు బుద్ధి చెప్పండి: సీఎం
రాళ్లు రువ్విన ఘటనపై దర్యాప్తు చేసి, అల్లర్లకు కారకులైన నిందితులకు చట్టపరమైన చర్యలతో తగిన గుణపాఠం చెప్పాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోలీస్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ ఘటన సమాజంలో శాంతి, భద్రతలకు భంగం కలిగించిందని, దీనిని తాను, తమ ప్రభుత్వం బలంగా ఖండిస్తోందన్నారు. ఘటనపై సీనియర్ పోలీస్ అధికారులతో చర్చించానని తెలిపారు.
బాధ్యులపై చర్యలకు డిమాండ్
రాయచూరు రూరల్: బాగల్‌కోటె నగరంలో ఛత్రపతి శివాజీ జయంతి ఊరేగింపుపై దుండగులు రాళ్లు విసిరిన ఘటనలో బాధ్యులపై చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సర్కార్‌ను డిమాండ్ చేశారు. శుక్రవారం లింగసూగూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికొచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న శివాజీ జయంతి ర్యాలీపై రాళ్లు విసిరిన నిందితులను అరెస్ట్ చేసి సరిహద్దు బహిష్కరణ చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల రక్షణ రాష్ట్ర సర్కార్ చేతిలో ఉంటుందన్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా వారి చేతులు కట్టేశారని ఆరోపించారు. పరిషత్ ప్రతిపక్ష నేత నారాయణ స్వామి, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, మానప్ప వజ్జల్, జిల్లాధ్యక్షుడు వీరనగౌడలున్నారు.
ఎనిమిది మంది అరెస్ట్
రాళ్లు రువ్విన కేసుకు సంబంధించి 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ గోయల్ తెలిపారు. నిందితులను తన్వీర్ హవాల్దార (25), సద్దామ్ (22), ముజ్జు కమతగి, ఫయాజ్ (24), సర్పరాజ చావుస్ (33) రియాన్ షేక్ (21), ఆయాన్ గుళేదగుడ్డ (19), వసీమ్ షేఖ్ (22)గా గుర్తించినట్లు తెలిపారు. ఊరేగింపులో డీజే సౌండ్లకు అనుగుణంగా హిందూ యువకులు నృత్యం చేస్తుండగా తంజీర్ రాళ్లు రువ్వారని, ఇతన్ని ఏ1గా గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రార్థనా మందిరం బయట ఉన్న పాదరక్షలను తెచ్చి ఊరేగింపుపైకి విసిరినట్లు వెల్లడైందన్నారు.
శివాజీ చిత్రపటం ర్యాలీపైకి రాళ్లు
తోపుడు బండ్లకు నిప్పు
ఎస్పీకి రక్తగాయాలు
24 వరకు నిషేధాజ్ఞలు జారీ
బాగల్‌కోటెలో ఉద్రిక్తత
బాగల్‌కోటెలో ఉద్రిక్తత
బాగల్‌కోటెలో ఉద్రిక్తత
బాగల్‌కోటెలో ఉద్రిక్తత


