ఆర్టీసీ చార్జీలు పెరగవు
శివాజీనగర: కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచడం లేదని రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. గత సంవత్సరం జనవరిలో టికెట్ ధరను 15 శాతం పెంచామన్నారు. చార్జీలు పెంచే విషయంపై ఏటా చర్చలు జరుగుతుంటాయన్నారు. చార్జీల ధరను నిర్ణయించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలనే యోచన ఉండేదని, అయితే కమిటీ ఇప్పటి వరకు ఏర్పాటు కాకపోవటంతో చార్జీల ధర పెంచే అవకాశం లేదన్నారు. రాబోయే 6 నెలల వరకు చార్జీలు పెరగవని తెలిపారు. కమిటీ ఏర్పాటు అయిన తర్వాతనే చార్జీల ధర పెంచేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
బనశంకరీదేవికి
విశేష పూజలు
బనశంకరి: బనశంకరీదేవీ సన్నిధి భక్తులతో పోటెత్తింది. శుక్రవారం వేకువజామున సుప్రభాతసేవ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ బనశంకరీదేవీ మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం, అర్చనలు, విశేష అలంకరణ చేపట్టి విశేషపూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధనచేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదానం చేశారు.
జీబీఏ పునఃరచనకు ప్రభుత్వ ఆదేశం
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ బెంగళూరు ప్రాధికార(జీబీఏ)ను పునఃరచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అధ్యక్షుడిగా సీఎం సిద్దరామయ్య, ఉపాధ్యక్షుడిగా డీసీఎం డీకే.శివకుమార్‌లను నియమించారు. శుక్రవారం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ బెంగళూరు పాలన నిబంధన– 2025 నేపథ్యంలో గ్రేటర్ బెంగళూరు పాలన నిబంధన 26–08–2025 ప్రకారం అమల్లోకి తీసుకు రావాలని ఆదేశాల్లో తెలిపింది. గ్రేటర్ బెంగళూరు ప్రాధికార సభ్యులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శోభా కరంద్లాజే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి, ఇంధన శాఖ మంత్రి కేజే.జార్జ్, నగరాభివృద్ధి శాఖ మంత్రి బీఎస్.సురేశ్ తదితరులను, ప్రాధికార కార్యదర్శిగా జీబీఏ కమిషనర్ మహేశ్వర్‌రావ్‌ను నియమించారు.
కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ.. ఇద్దరికి కత్తి గాయాలు
మండ్య: మండ్య జిల్లా మద్దూరు తాలూకా అటగూరు ఫిర్కాలోని అడగనహళ్లిలో పాత కక్షల కారణంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో కత్తి దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన గ్రామంలో గురువారం రాత్రి ఉద్రిక్తతను సృష్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గట్టి భద్రతను కల్పించారు. గ్రామానికి చెందిన ధనంజయ(19), అవినాష్ (35) కత్తి దాడిలో గాయపడి మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘర్షణపై కెస్తూరు పోలీసులు ధనంజయ, అవినాష్, నందీష్, కుమార్, రాజా, హరీష్, శివస్వామి, మరో గ్రూపుకు చెందిన రవితో సహా 8 మందిపై హత్యాయత్నం అభియోగాలపై కేసు నమోదు చేశారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకుని మద్దూరు జేఎంఎఫ్‌సీ కోర్టు ముందు హాజరు పరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
వేద విద్యావిహార గురుకుల పాఠశాలకు శంకుస్థాపన
యశవంతపుర: రామనగరకు సమీపంలోని బిన్నికుప్పె గ్రామాంలో నిర్మించతలపెట్టిన వేదవిద్యా విహర గురుకుల పాఠశాలకు కేంద్ర అర్థికశాఖ మంత్రి నిర్మల సీతరామన్ శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హోమ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక ఎంపీ డాక్టర్ మంజునాథ్, అయన భార్య అనుసూయలతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాగా ఎస్‌టీఆర్‌ఆర్ రింగ్‌రోడ్డుకు భూమిని కోల్పోయిన రైతులు కేంద్రమంత్రిని కలిసి తమకు త్వరగా పరిహారం అందేలా చూడాలని విన్నవించారు.


