నేటి నుంచి హంపీ ఉత్సవాలు
సాక్షి,బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన హంపీలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు హంపీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాల కోసం హంపీని నవవధువులా ముస్తాబు చేశారు. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా పరమ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి రోజున హంపీ ఉత్సవాలు ముగియనున్నాయి. హంపీలో సాక్షాత్తు విరుపాక్షేశ్వరుడు లింగరూపంలో కొలువు దీరిన నేపథ్యంలో అదే రోజు హంపీ ఉత్సవాలతో పాటు శివుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు విచ్చేస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. విజయనగర జిల్లా యంత్రాంగం హంపీలో ప్రతి చారిత్రక కట్టడానికి విద్యుత్ దీపాలంకరణ చేయడంతో హంపీ సౌందర్యం మరింత ఆకట్టుకునేలా ఉంది. ఉత్సవాలు నేపథ్యంలో కర్ణాటక నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి పర్యాటకుల సందడి పెరగనుంది. ఆరు ప్రధాన వేదికలు ఏర్పాటు చేసి, మన సంస్కృతి వారసత్వాలను కాపాడే దిశగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
గత వైభవాన్ని చాటేలా ..
హొసపేటె: ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపీలో ఈనెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు హంపీ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, 1000 డ్రోన్లతో ప్రత్యేక హైటెక్ షో, హంపీ బైస్కై హెలిరైడ్, జానపద కళారూపాలతో ఊరేగింపు అంగరంగ వైభవంగా జరగనుంది. హంపీ ఉత్సవాలకు ఈసారి సుమారు 8 నుంచి 10 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా. హంపీ ఉత్సవాలను శుక్రవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభించనున్నారు. 50 కిలో మీటర్ల మేర ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆరు ప్రధాన వేదికల్లో కృష్ణదేవరాయ వేదిక, విరుపాక్ష వేదిక వద్ద ప్రముఖ నటీనటులు, గాయకుల ప్రదర్శనలు, డోలు కుణిత, పులి వేషధారణలు వంటివి రాష్ట్ర వ్యాప్త కళాకారుల ప్రదర్శనలు అలరించనున్నాయి. సుమారు రూ.14–15 కోట్ల బడ్జెట్‌తో, 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. పర్యాటకులకు ప్రభుత్వం తరఫున ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.
విద్యుద్దీప కాంతుల్లో మిరుమిట్లుగొలుపుతున్న ప్రధాన వేదిక
ఉత్సవాల సందర్భంగా స్మారకాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ
నవవధువులా రాయల
రాజధాని ముస్తాబు
దేదీప్యమానంగా స్మారకాలకు
దీపాలంకరణ
నేటి నుంచి హంపీ ఉత్సవాలు


