ఆనకట్టలు.. అభివృద్ధికి జీవనాడులు | - | Sakshi
Sakshi News home page

ఆనకట్టలు.. అభివృద్ధికి జీవనాడులు

Feb 14 2026 7:24 AM | Updated on Feb 14 2026 7:24 AM

ఆనకట్టలు.. అభివృద్ధికి జీవనాడులు

ఆనకట్టలు.. అభివృద్ధికి జీవనాడులు

బనశంకరి: ఆనకట్టలు వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి, సామాజిక అభివృద్ధికి జీవనాడులు అని సీఎం సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. శుక్రవారం బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ(ఐఐఎస్సీ)లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆనకట్టల సురక్షత సమ్మేళనం–2026ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆనకట్టల సురక్షత కేవలం సాంకేతిక విషయమే కాదు, జాతీయ భద్రత అంశమని అన్నారు. కర్ణాటక దేశంలోనే అత్యధిక ఆనకట్టలు కలిగిన రాష్ట్రాల్లో ఒకటన్నారు. సురక్షత విషయంలో అనుభవం, జవాబుదారీ రెండూ కలిగి ఉందన్నారు. దేశ మొదటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రు ఆనకట్టలను ఆధునిక భారత దేవాలయాలు అని పిలిచారని గుర్తు చేశారు. దేశంలో ప్రస్తుతం 6,628 నిర్ధిష్ట ఆనకట్టలు ఉండగా, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆనకట్టలు కలిగిన దేశం భారత్‌ అన్నారు. కర్ణాటకలో 231 ఆనకట్టలు ఉండగా, దేశంలో 6వ స్థానంలో ఉందన్నారు. మైసూరు మహారాజులు ప్రత్యేకంగా నాల్వడి కృష్ణరాజ ఒడెయర్‌ నీటిపారుదల అభివృద్ధికి అధిక ప్రోత్సాహాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి స్మరించారు. అనంతరం దేవరాజ అరసు పాలనలో సమాన ప్రాంతీయ అభివృద్ధికి నీటిపారుదల విస్తరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో స్థాపించిన జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల సామర్ద్యం సుమారు 4,800 మెగావాట్లు కాగా వందలాది టీఎంసీల నీటిని సేకరించే సామర్థ్యం కలిగిన జలాశయాలు వ్యవసాయం, తాగు నీటి అవసరాలను తీరుస్తున్నాయన్నారు. సమ్మేళనంలో వివిధ దేశాల నిపుణులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

కేంద్రం అనుమతిస్తే మేకెదాటు, యూకేపీ అమలు

కేంద్రప్రభుత్వం అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం మేకెదాటు, అప్పర్‌ కృష్ణా పథకా(యూకేపీ)లను అమలు చేస్తామని, కేంద్రం తమకు సహకారం అందిస్తుందన్న నమ్మకం ఉందని డిప్యూటీ సీఎం, జలవనరుల శాఖ మంత్రి డీకే.శివకుమార్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం భారతీయ విజ్ఞాన సంస్థ జేజే టాటా సభాంగణంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆనకట్టల సురక్షత సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు మేకెదాటు, అప్పర్‌ కృష్ణా పథకాలపై తీర్పు ఇచ్చిందన్నారు. కేంద్రప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నామని అన్నారు. మేకెదాటు పథకంతో బెంగళూరుతో పాటు ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించడానికి, 400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి సహాయపడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement