కార్మిక సంఘాల సమ్మె
బళ్లారి రూరల్: దేశ వ్యాప్తంగా గురువారం జేసీటీయూ(జాయింట్ కమిటీ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా నగరంలో కార్మిక సంఘాల కార్యకర్తలు నగరంలో సమ్మె నిర్వహించారు. నారాయణరావు పార్క్ వద్ద నుంచి ర్యాలీగా పాత జిల్లాధికారి కార్యాలయం వరకు వెళ్లి అక్కడ భైటాయించి నిరసన చేపట్టారు. కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కష్టించి పని చేసే కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్‌ను తెస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రజా సేవా రంగాలైన రైల్వే, గనులు, బ్యాంకులు, బీమా, విమానయాన, ఆయిల్, పోస్టల్, రోడ్డు రవాణా, టెలికాం సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. నరేగ పథకాన్ని వీబీ జీ రామ్ జీ అని పేరు మార్చడాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు. సమ్మెలో భాగంగా గురువారం ఎల్‌ఐసీ, బ్యాంకులు మూతపడ్డాయి. ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘ ప్రముఖులు సూర్యనారాయణ, దత్తాత్రేయ, కార్మిక సంఘ ప్రముఖులు సత్యబాబు, ఆదిమూర్తి, దేవదాస్ తదితరులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించాలని సీఐటీయూ రాష్ట సంచాలకులు వీరేష్ డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రైతు, వ్యవసాయ, ఏపీఎంసీ, విద్యుత్ కార్మిక చట్టాలను జారీ చేయడం వల్ల రై తు, కార్మిక, వ్యవసాయ కూలీలకు అన్ని విధాలుగా నష్టపోతారని ఆరోపించారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు మద్దతు పలుకుతూ ఎర్ర తివాచీ పరచడాన్ని తప్పుబట్టారు. మనరేగలో తొలగించి వికసిత భారత్ మిషన్ రోజ్‌గార్ పేరును నమోదు చేయడం తగదని ఆరోపించారు. మనరేగ పథకం రద్దు వల్ల నేడు వలస వెళుతున్న కూలీలు, కార్మికులకు భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడంతో యరగేరలో రాయచూరు, కర్నూలు, మంత్రాలయం రహదారులను బంద్ చేసి రాస్తారోకో చేపట్టారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆందోళనలో పద్మ, వరలక్ష్మి, శరణ బసవ, రేణుకమ్మ, రంగమ్మ, అజీజ్, జిలాని, భీమణ్ణ, జగదీష్, ఆంజనేయ, తిమ్మప్ప తదితరులున్నారు.
కార్మిక సంఘాల సమ్మె


