అక్రమార్కుల గుండెల్లో లోకాయుక్త దడ
హుబ్లీ: లోకాయుక్త అధికారులు గురువారం రాష్ట్రంలోని ఇద్దరు ప్రభుత్వ అధికారులకు సంబంధించి పలు చోట్ల ఉన్న ఆస్తులపై ఏక కాలంలో దాడి చేశారు. లోకాయుక్త వర్గాల ప్రకారం ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించిన ఆరోపణల నేపథ్యంలో ధార్వాడ, దావణగెరెల్లో ఈ దాడులు చేశారు. ధార్వాడ సర్వే శాఖ సూపర్‌వైజర్ సోమలింగప్ప సిద్దనగౌడర్ నివాసం, ఆయన కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు దాడి చేశారు. లోకాయుక్త ఎస్పీ సిద్దలింగప్ప నేతృత్వంలో ధార్వాడ భారతీ నగర్ లే అవుట్‌లోని ఆయన నివాసంతో పాటు ఐస్‌గేట్ వద్ద ఉన్న సదరు కార్యాలయంలో అధికారులు క్షుణ్ణంగా సోదాలు చేసి రికార్డులను పరిశీలించారు. అంతేగాక బెళగావి జిల్లా మురగోడలోని సోమలింగప్ప నివాసంతో పాటు నాలుగు చోట్ల దాడులు చేయగా సోదాల తతంగం నడుస్తోంది.
దావణగెరెలోనూ..
ఇక దావణగెరెలో జెస్కాం ఇంజనీర్ ఆర్‌ఎస్ అర్జున్ నివాసం, కార్యాలయాల్లో దాడి చేసి ఆస్తి పత్రాలను పరిశీలించారు. కాగా అర్జున్ సదరు జెస్కాం సివిల్ విభాగంలో సేవలు అందిస్తున్నారు. దావణగెరె లోకాయుక్త ఎస్పీ ఎంహెచ్ కౌలపురే నేతృత్వంలో అర్జున్ నివాసం ఉన్న దావణగెరెలోని నిట్టువళ్లిలోని అద్దె గది, కార్యాలయం, శివమొగ్గలోని విజయనగర ప్రాంతంలోను గోపాలగౌడ లే అవుట్‌లోని రెండు నివాసాలపై ఏకకాలంలో దాడి చేశారు. ఇటీవల విజయనగర ప్రజాపనుల శాఖ ఈఈ దేవదాస్, అలాగే ఆయన కార్యాలయం అకౌంటెంట్ మారుతీ అనే వ్యక్తి తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి ఓ లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారుల వలలో చిక్కిన సంగతి తెలిసిందే.


