రేపు శ్రీగురు కొట్టూరేశ్వర రథోత్సవం
సాక్షి బళ్లారి: సమాజంలో మూఢ నమ్మకాలు, అసమానతలు, తారతమ్యాలు పేట్రేగిపోతున్న నాటి రోజుల్లో ఎందరో మహానుభావులు సమసమాజ స్థాపన కోసం కృషి చేసి సమాజాన్ని ఉద్ధరించేందుకు కృషి చేశారు. 12వ శతాబ్ధంలో విశ్వగురు బసవణ్ణ సమసమాజ స్థాపన కోసం కృషి చేసి సమాజంలో మార్పుకోసం తన చివరి శ్వాస వరకు అహర్నిశలు కృషి చేసి ఖ్యాతిని గడించారు. అదే తరహాలో ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కొట్టూరులో సమాజ అభివృద్ధికి, అసమానతలను తొలగించేందుకు 16వ శతాబ్ధంలో మధ్య కర్ణాటక ప్రాంతంలోని హరపనహళ్లి, నాయకనహట్టి, అరసీకెరె, కూలహళ్లి, కొట్టూరులో ఐదుగురు మహానుభావులు జన్మించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి, ఆధ్యాత్మికతను పెంపొందించి భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తూ దైవాంశ సంభూతులుగా ఖ్యాతికెక్కారు. విజయనగర జిల్లా కొట్టూరులో వెలసిన శ్రీగురు కొట్టూరు బసవేశ్వర రథోత్సవం కర్ణాటకలోనే ఖ్యాతిని గడించింది.
మూలా నక్షత్రంలో రథోత్సవం
దేశ వ్యాప్తంగా ఆకట్టుకుంటున్న శ్రీగురు కొట్టూరేశ్వర రథోత్సవం ఫిబ్రవరి 12వ తేదీ గురువారం అంగరంగ వైభవంగా జరగనుంది. అన్ని కులాలు, మతాలకు చెందిన వారు ఆరాధ్యదైవంగా భావించే కొట్టూరేశ్వరస్వామిని ఆరాధించి భక్తులు పునీతులవుతుంటారు. పాదయాత్రతో భక్తులు తరలి రావడం విశేషం. మూఢ నమ్మకాలను తొలగించే కార్యక్రమంలో భాగంగా కొట్టూరేశ్వర రథోత్సవాన్ని అందరూ అశుభంగా భావించే మూల నక్షత్ర సమయంలో రథోత్సవాన్ని నిర్వహిస్తుండడం విశేషం. మాదిగ సముదాయానికి చెందిన అరళయ్య వంశస్తులు హారతి ఇచ్చిన తర్వాతే రథం లాగడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా రావడం గమనార్హం. బళ్లారి జిల్లా నుంచే కాకుండా గదగ్, ముండరగి, హరిహర, దావణగెరె, చిత్రదుర్గ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు.
మూఢనమ్మకాలను పారదోలిన
మహనీయుడు
కొట్టూరుకు తరలి వస్తున్న
భక్తజన సందోహం
భక్తులకు సోదరభావంతో ఆతిథ్యం
రథోత్సవానికి వచ్చే భక్తులకు సోదరభావంతో ఆతిథ్యం ఇస్తుంటారు. పరిచయం లేని వ్యక్తులనైనా కొట్టూరులో జాతర సమయంలో అందరూ మనవాళ్లుగా భావించి వారికి వసతులు కల్పించి సేవలు చేయడం భక్తి పరాకాష్టకు నిదర్శనంగా చెప్పవచ్చు. కొట్టూరేశ్వర స్వామి మహిమలు మెచ్చి మొగల్ చక్రవర్తి ఇచ్చిన మణిమంచం ఇప్పటికీ మఠంలో దర్శనమిస్తోంది. కొట్టూరేశ్వరస్వామిని హిందూ, ముస్లిం ఇలా కుల మతాలకు అతీతంగా సేవించి తరిస్తుంటారు. వీరశైవ మత పురాణం, చెన్నబసవ పురాణం, గురురాజ చరిత్ర, శ్రీగురు కొట్టూరేశ్వర స్వామి తదితర కావ్యాలు, గ్రంథాలు, మహిమలను, జానపద గేయాల్లో కూడా పౌరాణిక విశేషాలు, మహిమలు ప్రస్తావించారు. ఎంతో మహిమాన్వితమైన శ్రీగురు కొట్టూరేశ్వరస్వామి జాతర, రథోత్సవాన్ని తిలకించడానికి కొట్టూరుకు జనజాతర తరలి వస్తోంది. ఈసందర్భంగా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
రేపు శ్రీగురు కొట్టూరేశ్వర రథోత్సవం


