హంపీ ఉత్సవాలకు వేళాయె
హొసపేటె: హంపీ ఉత్సవాలు ఈనెల 13న ప్రారంభం కానుండటంతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. హంపీ ఉత్సవానికి ఐదు వేదికలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉత్సవం ప్రధాన వేదిక గాయత్రి పీఠం మైదానంలో ఏర్పాటు చేస్తున్న ఎంపీ ప్రకాష్ వేదికను రాయల కాలం నాటి స్మారకాలు, నమూనా పద్ధతిలో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా ఈ వేదికపై శ్రీకృష్ణ దేవరాయల వైభవం దర్బార్ చిత్రాన్ని రూపొందించి వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ సారి వేదిక ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే శిల్పకళా శిబిరాన్ని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి ప్రారంభించారు. శిల్ప సురేష్ ఆచార్ నాయకత్వంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి శిల్పులు రాతితో కళను సృష్టించడానికి ముందుకు వచ్చారు.
నేటి నుంచి శిల్పకళా శిబిరం
ఈ శిబిరం ఫిబ్రవరి 11న ప్రారంభమవుతుంది. హంపీ ఉత్సవం సందర్భంగా సృష్టించిన రాతి విగ్రహాలను ప్రదర్శనలో ఉంచుతారు. హంపీలో ఉత్సవంలో ఆకర్షణగా ఉండటానికి మాతంగ పర్వతం వద్ద, రాత్రిపూట లైటింగ్‌లో చూసినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. హంపీ చుట్టూ ఉన్న రోడ్ల మరమ్మతులు చేపట్టారు. కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. పండుగకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. హొసపేటె– హంపీని కలిపే ప్రధాన రహదారులను శుభ్రపరుస్తున్నారు. రోడ్డు వెంట ఉన్న ముళ్లచెట్లను తొలగిస్తున్నారు. హంపీ వైపు వెళ్లే రహదారుల్లో స్వాగత తోరణాలు నిర్మిస్తున్నారు.
హంపీ ఉత్సవాలపై అవగాహనకు బైక్ ర్యాలీ
హంపీ ఉత్సవాలపై అవగాహన కల్పించడానికి వివిధ శాఖల సహకారంతో 150కి పైగా బైక్‌లతో మంగళవారం భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని విజయనగర జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నగరంలోని ప్రధాన వీధులా గుండా సాగి అనంతశయనగుడి, కొండనాయకనహళ్లి, మలపనగుడి, గాళెమ్మనగుడి, కడ్డిరాంపుర మీదుగా హంపీలోని విరుపాక్షేశ్వర ఆలయానికి చేరుకుంది. జిల్లా ఎస్పీ జాహ్నవి, జెడ్పీ సీఈఓ అక్రమ్ షా, అనేక మంది సీనియర్ అధికారులు పాల్గొని ర్యాలీకి మద్దతు ఇచ్చారు. నగరంలోని వివిధ సర్కిళ్లలో జరిగిన బైక్ ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించడమేగాక చారిత్రక హంపీ గత వైభవాన్ని మరింతగా ప్రచారం చేయడానికి దోహదపడింది.
చురుగ్గా ప్రధాన వేదికల నిర్మాణ పనులు
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం
హంపీ ఉత్సవాలకు వేళాయె
హంపీ ఉత్సవాలకు వేళాయె


