మహనీయుల ఆదర్శాలు అనుసరణీయం
చెళ్లకెరె రూరల్: మహనీయుల మానవతా సందేశాలు, విలువలను యువత అలవరుచుకోవాలని తహసీల్దార్ రెహన్ పాషా తెలిపారు. ఆయన తాలూకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళిత వచనకారుల జయంతిలో పాల్గొని మాట్లాడారు. వచనకారులు తమ కాలఘట్టంలో అసమానత, అంటరానితనంపై ఆనాడే ప్రజలను చైతన్య పరిచారన్నారు. ప్రస్తుతం వచనకారుల వచనాల్లో వ్యక్తమైన శ్రమ, సంస్కృతి, సమానత, మానవీయత సందేశాలను యువత అర్థం చేసుకోవాలన్నారు. దళిత వచనకారులు మాదార చెన్నయ్య, డోహర కక్కయ్య, మాదార జూళయ్య వంటి మహనీయులు సమానత, మానవతా విలువల గురించి తమ వచనాల ద్వారా ప్రజలను చైతన్య పరిచారన్నారు. నగరసభ ముఖ్యాధికారి నాగవేణి, సీడీపీఓ రాజనాయక్, డీసీఎం అధికారి రమేష్‌కుమార్, వ్యవసాయ అధికారి రమేష్, దళిత నాయకులు విజయ్‌కుమార్, సమర్థరాయ్, వీరభద్రప్ప, తిప్పేస్వామి పాల్గొన్నారు.
చిత్రలేఖన శిబిరం ప్రారంభం
హొసపేటె: హంపీ ఉత్సవంలో భాగంగా ఎదురు బసవన్న వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన చిత్రలేఖన శిబిరాన్ని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి ఒక చిత్రాన్ని గీయడం ద్వారా ప్రారంభించారు. ఏడీసీ ఈ.బాలకృష్ణ, సబ్ డివిజనల్ ఆఫీసర్ పీ.వివేకానంద, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ అనుపమ, కన్నడ సంస్కృతి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దలింగేష్ రంగన్నవర్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు.
కాయక శరణులకు పుష్పాంజలి
రాయచూరు రూరల్: నగరంలో కాయక శరణుల జయంతిని వేడుకగా ఆచరించారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్‌లో కాయక శరణులు మాదర చెన్నయ్య, డోహర కక్కయ్య, ఉరిలింగ పెద్ది, సర్వజ్ఞల చిత్రపటాలకు తహసీల్దార్ సురేష్‌వర్మ పుష్పాంజలి ఘటించారు. అనంతరం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జయంతిని ప్రారంభించారు. సమాజంలో అట్టడుగున ఉన్న కుమ్మర సమాజం ఆర్థికంగా, సాంఘీకంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.


