ఘనంగా మస్తకాభిషేకాలు
బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన హళేబీడులోని జైనరగుత్తి ప్రాంతంలో జైన తీర్థంకరులకు మస్తకాభిషేకాలు జరుగుతున్నాయి. గర్భగుడిలోని 24 మంది తీర్థంకరులు, పార్శ్వనాథ తీర్థంకర విగ్రహానికి పవిత్ర ద్రవ్యాలతో మస్తకాభిషేకం నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జైన ఆలయం మంత్రోచ్ఛారణలతో, మంగళవాయిద్యాలతో మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి జైన మునులు పాల్గొన్నారు. గంధం, పాలు, అశ్వగంధం, కొబ్బరి నీళ్లు, పూలు తదితరాలతో విగ్రహాలను అభిషేకం చేశారు. తీర్థోద్ధారక వీర సాగర్ ముని మహారాజ్ జైన సమాజాన్ని ఏకం చేసి జైనరగుత్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని నిర్వాహకులు తెలిపారు. అనేక ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
వాలెంటైన్స్ డేకు హోసూరు గులాబీలు
● రోజూ 10 లక్షల ఎగుమతి
హోసూరు: 14వ తేదీన ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమజంటలు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. పూలు, కానుకలతో శుభాకాంక్షలు చెప్పుకుంటారు. దీంతో హోసూరు గులాకీగా గిరాకీ పెరిగింది. పెద్దమొత్తంలో రోజా పుష్పాలను ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. హోసూరు ప్రాంతంలో రైతులు పండించే గులాబీలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. క్రిష్ణగిరి జిల్లాలో పూల సాగుకు అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండడంతో హోసూరు, బాగలూరు, బేరికె, డెంకణీకోట, తళి, అంచెట్టి, కెలమంగలం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు గ్రీన్ షెడ్లలో గులాబీ తోటలను సాగు చేస్తున్నారు. నాణ్యత బాగా ఉండడంతో ప్రపంచ మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలకే కాక ప్రేమికుల రోజుకు లక్షలాది పూలను ఎగుమతి అవుతాయి. వాలెంటైన్స్ డే కోసం గత కొన్నిరోజులుగా నిత్యం 10 లక్షల పూలను ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో గులాబీ రూ. 20 నుంచి 30 దాకా ధర పలుకుతోంది. మంచి రేటు వచ్చిందని పలువురు రైతులు, వ్యాపారులు తెలిపారు.
మంత్రి చాంబర్‌లో నగలు, డబ్బు చోరీ, ఉద్యోగి అరెస్టు
శివాజీనగర: రాష్ట్ర నగరాభివృద్ధి మంత్రి భైరతి సురేశ్ విధానసౌధలోని కార్యాలయంలో 300 గ్రాముల బంగారు నగలు, రూ.1.50 లక్షల డబ్బులున్న బ్యాగ్ దొంగతనం కావడం కలకలం రేపుతోంది. ఈ కేసులో డీ గ్రూప్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. నవీన్ అనే వ్యక్తి పని మీద మంత్రి సురేశ్ ఛాంబర్‌కు వస్తూ నగలు, డబ్బు బ్యాగుతో వచ్చారు. వెళ్లేటపుడు దానిని ఆ చాంబర్‌లోనే మరిచిపోయారు. మరుసటి రోజు వచ్చి చూస్తే బ్యాగు లేదు. విధానసౌధ ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీసులు తనిఖీ ఆరంభించారు. కార్యాలయం సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, డీపీఏఆర్ శాఖలో డీ గ్రూపు ఉద్యోగి అయిన ఒకరు బ్యాగ్‌ను తీసుకొని వెళ్లినట్లు తెలిసింది. ఆ ఉద్యోగిని అరెస్ట్ చేశారు.
భక్తులపై చిరుత దాడి,
బాలునికి గాయాలు
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలె మహదేశ్వర బెట్ట ఆలయానికి నడిచి వెళ్తున్న భక్తులపై చిరుతపులి దాడి చేసింది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. చెన్నపట్టణ తాలూకా భువళ్లి గ్రామానికి చెందిన శ్రేయస్ (8) అనే బాలుడు ఈ దాడిలో గాయపడ్డాడు. మహాశివరాత్రి రాబోతుండగా, వేలాదిమంది భక్తులు మహదేశ్వర బెట్టకు పాదయాత్రగా వెళుతున్నారు. పొన్నాచి క్రాస్ నుంచి పాదయాత్రికుల మీద చిరుత పంజా విసిరింది. బాలుని చెవులకు గాయాలయ్యాయి. మహదేశ్వర బెట్ట ఠాణా సీఐ జగదీష్, అటవీ శాఖ సిబ్బంది చేరుకుని పరిశీలించారు. బాలున్ని బెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. భక్తులు అటవీ మార్గంలో కాకుండా ప్రధాన రహదారిలో పాదయాత్రగా రావాలని అటవీ అధికారులు కోరారు.
ఘనంగా మస్తకాభిషేకాలు
ఘనంగా మస్తకాభిషేకాలు


