చిన్నపాప ఇక లేదు
● సోషల్ మీడియా సెలబ్రిటీ రేష్మా ఆత్మహత్య!
యశవంతపుర: అనుమానాస్పదంగా సోషల్ మీడియా కార్యకర్త ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన ఘటన కేరళ– కర్ణాటక సరిహద్దుల్లోని కాసరగోడులో జరిగింది. చిన్న పాప అనే పేరుతో రేష్మా (24) సోషల్ మీడియా కార్యకర్తగా ప్రజాదరణ పొందింది. ఉళియత్తడ్కలో బాడుగ ఇంటిలో నివాసం ఉంటోంది. అదే ఇంటిలో మంగళవారం మధ్యాహ్నం ఆమె ఉరి వేసుకొన్న స్థితిలో ఉండగా, స్థానికులు చూసి కిందికి దించి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించింది. ప్రజుల్లా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేష్మాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు.
ఇటీవలే విడాకులు
అయితే తీవ్రమైన గొడవలు కావడంతో నెల కిందటే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఒక్కరే జీవిస్తోంది. కొడుకును కాసరగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంచింది. రేష్మా ఇంటికి ఆమె ప్రేమికుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని తెలిసింది. రేష్మా ముబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. రేష్మా తల్లిదండ్రులు గంగాధరన్, శైలజ కాగా, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆమె తండ్రి జీపు డ్రైవరు. ఇన్‌స్టాలో రేష్మాకు 2 లక్షలకు పైగా ఫోలోయర్లు ఉన్నారు. డ్యాన్సులు, స్కిట్లు వంటి కార్యక్రమాలతో ఆదరణ పొందుతోంది. గ్రామీణ జీవితం, వంటకాల పోస్టులు చేసేది. చిన్నపాప మరణంతో సోషల్ మీడియాలో ఆవేదన, సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కుటుంబ గొడవలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానాలున్నాయి.
కారు దగ్ధం, ఐదుమంది క్షేమం
యశవంతపుర: ఉడుపి జిల్లా కాపు తాలూకా శిర్వలో సోమవారం అర్ధరాత్రి కారులో మంటలు వ్యాపించాయి. ఐదుమంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంగళూరు నుంచి శిర్వకు వెళుతున్న కారు ఇంజిన్‌లో నుంచి దట్టమైన పొగ వచ్చింది. డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపాడు. ప్రయాణికులు దిగుతుండగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించి కారును చుట్టుముట్టాయి. కొంతసేపటికే కారు కాలిపోయింది. స్థానికులు నీళ్లు చల్లినా ఉపయోగం లేదు. పోలీసులు పరిశీలించారు.
ముడా కేసులో
తీవ్ర విచారణ
మైసూరు: రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ఇళ్ల స్థలాల కుంభకోణం కేసులో సీఎం సిద్దరామయ్య కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతున్నదీ తెలిసిందే. ఇక సామాన్యలు పరిస్థితి కూడా మామూలుగా లేదు. అక్కడ స్థలాలను అమ్మిన, కొన్నవారు అవస్థల్లో ఉన్నారు. 50:50 నిష్పత్తి వ్యవహారంలో 134 కేసులు వచ్చాయి. సైట్‌లను పొందిన 40 మందికి పైగా లబ్ధిదారులకు లోకాయుక్త అధికారులు నోటీసులు జారీ చేశారు. 1055 సైట్‌లలో రూ.వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో లోకాయుక్త దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పుడు ముడా మాజీ కమిషనర్లు దినేష్, నటేష్‌తో సహా అధికారులు, స్థలాల యజమానులు విచారణకు వచ్చి సమాధానాలు ఇవ్వాలని లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ నోటీసులిచ్చారు.
చిన్నపాప ఇక లేదు


