నేత్రపర్వం చూణోత్సవం
యశవంతపుర: ఉడుపి శ్రీకృష్ణ మఠంలో చూణోత్సవం(పగటి జాతర) వైభవంగా జరిగింది. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తిని బంగారు పల్లకీలో తెచ్చి రథంలో కొలువు దీర్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మహామంగళారతి సమర్పించిన తరువాత బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య రథంముందుకు సాగింది. పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్రతీర్థస్వామి, చిన్నస్వామి యతి సుత్రీంద్ర తీర్థస్వామిలు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అదమూరు మఠం విశ్వప్రియ తీర్థ శ్రీపాద, పేజావర మఠం విశ్వప్రసన్నతీర్థస్వామి పాల్గొన్నారు.
అత్యాచార నిందితునికి
20 ఏళ్ల జైలు శిక్ష
హుబ్లీ: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి బెళగావి అదనపు జిల్లా సెషన్స్ ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1.18 లక్షలు జరిమానా విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. బెళగావి జిల్లాలోని హుక్కేరి తాలూకా బెళవి గ్రామ నివాసి ప్రవీణ్(23) అనే యువకుడు 2021 జూలై 21న సాయంత్రం వేళ సదరు బాలికను హుక్కేరి బస్టాండుకు రావాలని సూచించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ధార్వాడ మీదుగా బెంగళూరుకు వెళ్లారు. అక్కడికి తీసుకెళ్లాక ఇక్కడే పెళ్లి చేసుకుందామని నమ్మబలికి ఒత్తిడి చేసి ఆమైపె లైంగిక దాడికి పాల్పడినట్లు హుక్కేరి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దాఖలాధికారి ఎల్‌ఎల్ పట్టెనవర్ దర్యాప్తు ప్రారంభించారు. ఎంఎం తహసీల్దార్ తదుపరి దర్యాప్తు చేపట్టి బెళగావి పోక్సో కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి సీఎం పుష్పలత 11 మంది సాక్షుల విచారణతో పాటు 48 దాఖలాల ఆధారంగా నిందితునిపై నేరారోపణలు రుజువు కావడంతో పైవిధంగా తీర్పును ఇచ్చారు. పైగా బాధితురాలికి జిల్లా న్యాయసేవా ప్రాధికార ద్వారా రూ.4 లక్షల పరిహారధనం అందించాలని సూచించారు. ఆ సొమ్మును ఐదేళ్ల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని కోర్టు న్యాయాధికారికి సూచించింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది ఎల్‌వీ.పాటిల్ వాదించారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల వెనుక దురుద్దేశాలు
● బీ.వై.విజయేంద్ర ఆరోపణ
శివాజీనగర: వీబీ జీ రామ్‌జీ పథకం గురించి చర్చ పేరుతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు ద్వారా ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వపు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ పవిత్రతను భగ్నం చేసేందుకు సిద్ధమైందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ధ్వజమెత్తారు. శుక్రవారం బెళగావిలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి అసెంబ్లీని దుర్వినియోగ పరచటం ఖండనీయమన్నారు. ప్రధాని మోదీ మార్పు చేసి మనరేగ పథకాన్ని వీబీ జీ రామ్‌జీ పథకంగా చేశారు. దేశంలో పేదలు, కార్మికులకు అనుకూలం చేయాలని ఈ చట్టాన్ని తెచ్చారు. దీని గురించి చర్చించాలనే నెపంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి బీజేపీ నేతృత్వపు ఎన్‌డీఏ ప్రభుత్వంపై ద్వేష సాధనకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ గురించి తరచు మాట్లాడే సీఎం సమాఖ్య వ్యవస్థను భంగపరిచే కుట్ర చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.
లక్కుండిలో నిధి తవ్వకాలు షురూ
శివాజీనగర: గదగ్ జిల్లా వాస్తుశిల్ప పరంపర కేంద్రం, చారిత్రక లక్కుండి గ్రామంలో ఇంటి నిర్మాణ సమయంలో బంగారు ఆభరణాలు బయటపడిన తరువాత కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం నుంచి నిఽధి తవ్వకాలకు సిద్ధమైంది. లక్కుండిలోని కోటె వీరభద్రేశ్వర ఆలయ ఆవరణలో పూర్తి స్థాయిలో తవ్వకాలు ప్రారంభించారు. పర్యాటక, పురాతత్వ, వస్తు సేకరణ కేంద్రాలు, లక్కుండి పరంపర అభివృద్ధి ప్రాధికార, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ కార్యాచరణను చేపట్టాయి. ఆలయ ఆవరణలో తవ్వకాలు చేపట్టేందుకు జేసీబీలు, ట్రక్‌లు, ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తవ్వకాల కోసం 10 మీటర్ల ప్రదేశాన్ని గుర్తించి సిబ్బందిని నియమించినట్లు అధికారి తెలిపారు.


