కన్నడ భాషను ప్రోత్సహిద్దాం
బొమ్మనహళ్లి : కన్నడ మన భాష, మన రాష్ట్ర భాష. ఇక్కడికి ఎవరు వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఇక్కడ నివసించేవారు కన్నడ నేర్చుకోవాలి. కన్నడను వ్యాపార భాషగా ఉపయోగించాలి. కన్నడకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం అవసరం, అనివార్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. శుక్రవారం విధానసౌధ ముందు భాగంలో ఉన్న మహా మెట్లపై కన్నడ సంస్కృతి శాఖ, వివిధ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన ’బెంగళూరు హబ్బ–2026’ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి నివసించడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ కన్నడిగులుగా జీవించి కన్నడ నేర్చుకోండి. కన్నడిగులుగా బెంగళూరులో కన్నడత్వాన్ని పెంపొందించడానికి కృషి చేద్దాం. దీని కోసం మనమందరం చేతులు కలుపుదాం అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. బెంగళూరు ఉత్సవంలో భాగంగా శుక్రవారం నుంచి 10 రోజుల పాటు 30కి పైగా ప్రాంతాల్లో 350కి పైగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. బెంగళూరు పౌరులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వాటిని ఆస్వాదించండి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసించే వారికి మన సాహిత్యం, కళలు, సంస్కృతిని పరిచయం చేయడంలో ఈ ఉత్సవం సహాయకరంగా ఉంటుందని ఆయన అన్నారు. శాసనమండలి స్పీకర్ బసవరాజ్ హొరట్టి, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నసీర్ అహ్మద్, శాసనసభ చీఫ్ విప్ అశోక్ పట్టాన్, నటుడు డాక్టర్ శివరాజ్ కుమార్, నటి డాక్టర్ జయమాల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలినీ రజనీష్, కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ అధ్యక్షుడు డాక్టర్ పురుషోత్తం బిళిమలె, కర్ణాటక ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు కె.గోవిన్, పలువురు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కన్నడ భాషను ప్రోత్సహిద్దాం


