ప్రాణాలు తీసిన ఈత సరదా
దొడ్డబళ్లాపురం: సంక్రాంతి పండుగ సెలవులు ఎనిమిది కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. సెలవుల్లో సరదాగా ఈతకు వెళ్లి బాలలు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది మంది జల సమాధి అయ్యారు. బాగలకోటె జిల్లా ముధోళ తాలూకా జాలికట్టికి చెందిన అన్నదమ్ములు మనోజ్(17)ప్రమోద్(17)లు గ్రామ శివారులోని క్వారీలోకి దిగారు. ఈత కొడుతూ నీట మునిగి మృతి చెందారు. స్నానం చేయడానికి క్వారీ గుంతలో దిగి ఈత కొడుతూ మృతి చెందారు. పోలీసులు వచ్చి మృతదేహాలను వెలికి తీశారు. కేసు దర్యాప్తులో ఉంది. అదేవిధంగా మాన్వి తాలూకా చిక్కపలర్విలోని తుంగభద్ర నదిలో పుణ్యస్నానం చేయడానికి వెళ్లిన రాజలదిన్ని గ్నామ నివాసి సురేంద్రగౌడ(17)నీటిలో మునిగి మృతిచెందాడు. హావేరి తాలూకా మణ్ణూరు గ్రామంలో వరదా నదిలో సంక్రాంతి సందర్భంగా ఎద్దుకు స్నానం చేయించడానికి నీటిలో దిగిన బసవరాజు(22)అనే యువకుడు నీటమునిగి మృతిచెందాడు.
కనకపుర తాలూకాలో..
పండుగ పూట రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు జల సమాధి అయిన ఘటన కనకపుర తాలూకాలోని కబ్బాళులో జరిగింది. బెంగళూరు ఉత్తరహళ్లి నివాసులైన ధనుష్(18)సంతోష్(18)లు బనశంకరిలోని ప్రైవేటు కాలేజీలో పీయూసీ చదువుతున్నారు. ఇదే కాలేజీకి చెందిన తొమ్మిది మందితో కలిసి శుక్రవారం కబ్బాళు దేవాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా సరదాగా కబ్బాళు చెరువులో దిగారు. వీరిలో ఎవరికీ ఈత రాదు. ఈక్రమంలో ధనుష్, సంతోష్‌లు చెరువు మధ్యలోకి వెళ్లి మునిగిపోయారు. అగ్నిమాపకదళ సిబ్బంది పోలీసులు వచ్చి మృతదేహాలను వెలికి తీశారు. కేసు దర్యాప్తులో ఉంది.
యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లాలో నీట మునిగి ఇద్దరు బాలలు మృతి చెందారు. కార్వార తాలూకా ముదగా నౌకదళం నిరాశ్రితర కాలనీలో నివాసం ఉంటున్న 8వ తరగతి విద్యార్థి సోనాల అరగేకర(12) గురువారం సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవు కావటంతో స్నేహితులతో కలిసి సముద్ర తీరం వద్దకు వెళ్లాడు. ఈతకొడుతూ అలల మధ్య చిక్కుకొని మృతి చెందాడు. అదేవిధంగా దాండేలి మౌళంగి సమీపంలో కాళీనది సంగమ ప్రాంతంలో దాండేలి గాంధీనగరకు చెందిన నవాజ్ నాయక్(18) అనే బాలుడు మృతి చెందాడు. పోలీసులు, అటవీశాఖ సిబ్బంది వెతికి మృతదేహంను బయటకు తీశారు. దాండేలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది మృతి
ప్రాణాలు తీసిన ఈత సరదా
ప్రాణాలు తీసిన ఈత సరదా


