గనినాడులో మళ్లీ రాజకీయ వేడి
సాక్షి బెంగళూరు: గనినాడుగా పేరొందిన బళ్లారిలో జరిగిన అల్లర్లు, ఫైరింగ్ ఘటన సరికొత్త రాజకీయాలకు నాందిగా మారింది. వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణకు సంబంధించిన బ్యానర్ ఏర్పాటు విషయంలో జరిగిన గొడవ కాస్తా అనేక మలుపులు తిరుగుతోంది. బళ్లారి అల్లర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ అల్లర్లకు పూర్తి కారణం బీజేపీనే అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం బీజేపీ భారీ ఆందోళన సమావేశం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం బళ్లారిలో జరిగిన అల్లర్లు, జరుగుతున్న ఆందోళనలు, పోరాటాలు, పాదయాత్రలు జిల్లా రాజకీయాన్ని వాడివేడిగా మార్చాయి. బళ్లారి ఒకప్పుడు మైనింగ్ వ్యాపారం చేసుకునే వారితో సందడిగా ఉండేది. గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు, రెడ్డి సోదరులు మైనింగ్ ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇదే సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చక్రం తిప్పారు.
నాడు జోడెద్దుల్లా ఎన్నికల ప్రచారం
1999 లోక్‌సభ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ బళ్లారిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు సుష్మా స్వరాజ్ తరపున ఎన్నికల ప్రచారంలో జోడెద్దుల్లా వ్యవహరించారు. ఆ తర్వాత జిల్లాలో బీజేపీ ఒక వెలుగు వెలిగింది. అనంతరం జరిగిన ఆపరేషన్ కమలలో కూడా రెడ్డి సోదరుల పాత్ర ఎంతో కీలకంగా మారింది. అయితే మైనింగ్ కుంభకోణం కేసులో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు కావడం, జైలుకెళ్లడం జిల్లా రాజకీయాలను మార్చివేసింది. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సిద్ధరామయ్య బళ్లారిలో పాదయాత్ర చేపట్టారు. అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చలో భాగంగా రెడ్డి సోదరుల సవాల్‌ను స్వీకరించి సిద్ధరామయ్య బళ్లారికి పాదయాత్ర చేపట్టారు. అప్పట్లో అది రాజకీయంగా సంచలంగా మారింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావడానికి ఈ పాదయాత్ర ముఖ్య పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుంది.
జనార్ధన్‌రెడ్డి అరెస్టుతో బీజేపీ పతనం
2011లో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు తర్వాత జిల్లాలో బీజేపీ తీవ్రంగా వెనుకబడి పోయింది. ఇటీవలే గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీ బీజేపీలో యాక్టివ్‌గా మారడంతో జిల్లా రాజకీయాలకు పూర్వ వైభవం వచ్చింది. తాజాగా బళ్లారిలో ఫైరింగ్ ఘటన అనంతరం బీజేపీ మరింత క్రియాశీలకంగా మారింది. ఈ ఫైరింగ్ ఘటనపై పోరాటం చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. నేడు బళ్లారి భారీ ఆందోళన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆందోళన అనంతరం పాదయాత్ర చేపట్టాలని జిల్లా బీజేపీ నిర్ణయించింది. బళ్లారిలో బీజేపీ ఆందోళన, పాదయాత్ర ద్వారా రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరుతుందనే ఆసక్తి ప్రస్తుతం అన్ని వైపులా కనిపిస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత తన స్నేహితుడు మాజీ మంత్రి శ్రీరాములుతో సత్సంబంధాలు దాదాపుగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవలే తిరిగి బీజేపీ గూటికి గాలి జనార్ధన్ రెడ్డి చేరడంతో మళ్లీ వీరి మధ్య పాత స్నేహం చిగురించింది. ఆ స్నేహం నేపథ్యంలో బళ్లారిలో బీజేపీకి పూర్వ వైభవం వస్తుందని ప్రతిపక్ష పార్టీ ఆశగా ఉంది. మరోవైపు బళ్లారిలో ఫైరింగ్ ఘటన కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ మాత్రం సీబీఐ విచారణ అవసరం లేదని, స్థానిక పోలీసుల ద్వారా న్యాయం లభిస్తుందని తోసిపుచ్చారు.
నేడు బళ్లారిలో బీజేపీ భారీ సమావేశం
గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీరాములు
ఐకమత్యంతో రాజకీయాలు యాక్టివ్


