మరో ఇద్దరు ప్రైవేట్ గన్‌మెన్ల అరెస్ట్
సాక్షి,బళ్లారి: నగరంలో ఈనెల 1వ తేదీన మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న రగడ, కాల్పుల్లో ఒక యువకుడు మృతి చెందిన కేసులో మరో ఇద్దరు ప్రైవేటు గన్‌మెన్లను అరెస్ట్ చేశారు. కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందడంతో పాటు గాలి జనార్ధనరెడ్డి, శ్రీరాములులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తూ వీడియోలను విడుదల చేస్తుండగా, ఇప్పటికే ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆప్తుడు సతీష్‌రెడ్డి గన్‌మెన్లు ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. వీరిలో పలువురు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించడంతో సీఐడీ అధికారుల బృందం నాలుగు రోజుల పాటు నగరంలో తిష్ట వేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు ప్రైవేటు గన్‌మెన్లను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
నేడు బీజేపీ భారీ ఆందోళన
కాగా కాల్పులకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఈనెల 17న నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనుంది. నగరంలోని ఏపీఎంసీలో జరిగే సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్, కేంద్ర మంత్రి కుమారస్వామి తదితరులతో పాటు పలువురు బీజేపీ ప్రముఖులు విచ్చేస్తుండటంతో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సమావేశ వేదిక వద్ద ఏఎస్పీ రవికుమార్ నేతృత్వంలో బందోబస్తును తనిఖీ చేశారు. వేదిక స్థలానికి చేరుకున్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డితో కూడా ఏఎస్పీ కొంతసేపు మాట్లాడారు. ఏపీఎంసీతో పాటు ఇతర ప్రముఖ రహదారుల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేటి బీజేపీ సమావేశానికి గట్టి బందోబస్తు
బహిరంగసభకు హాజరుకానున్న పార్టీ అగ్రనేతలు


