అడవి పేరుతో మమ్మల్ని వెళ్లగొట్టొద్దు
డీసీఎఫ్ కాజల్ పాటిల్‌కు వినతిపత్రం
బన్నేరుఘట్ట జూపార్క్ వద్ద పలు గ్రామాలవాసుల ధర్నా
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలోని బన్నేరుఘట్ట జాతీయ అభయారణ్యం వివాదంలో చిక్కుకుంది. ఈ అభయారణ్యం పర్యావరణ సూక్ష్మ మండలాన్ని అశాసీ్త్రయంగా విస్తరిస్తున్నారని, దీనివల్ల బన్నేరుఘట్ట చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు వస్తాయని ప్రజలు భారీగా నిరసనకు దిగారు. హక్కిపిక్కి కాలనీ, బన్నేరుఘట్ట, రాగిహళ్లితో సహా చుట్టుపక్కల గ్రామాలవాసులు మంగళవారం బన్నేరుఘట్ట సర్కిల్‌లో బైఠాయించారు. ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర హై–పవర్ కమిటీ సభ్యుడు చంద్రప్రకాష్ గోయల్ బన్నేరుఘట్టను సందర్శించినప్పుడు, అధికారులకు ఆయనకు అశాసీ్త్రయ సమాచారం ఇచ్చారని నిరసనకారులు ఆరోపించారు. ఈ అటవీ ప్రాంతంలో ఏనుగులు, జంతువులు– మానవ సంఘర్షణల డేటాను సరిగ్గా రూపొందించలేదన్నారు. సూక్ష్మ మండలం పరిధిపై నిర్ణయాలు తీసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ఆఫీసుల్లో కాదు, ప్రజల మధ్య సమావేశాలు జరపాలన్నారు.
సర్వం కోల్పోతాం
సూక్ష్మ మండలాలను విస్తరిస్తే ఆయా గ్రామాల నుంచి ప్రజలను దూరంగా పంపిస్తారు, దీనివల్ల గూడు కోల్పోతామని వాపోయారు. అడవిలో నివసించే పేదల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయన్నారు. ఈ ప్రాంతంలో ఇళ్ళు నిర్మించే వారికి రుణ సౌకర్యాలు లభించవు, వ్యాపారాలకు ఆస్కారం ఉండదన్నారు. తమ 20 వేల కుటుంబాల పునరావాసం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అందువల్ల, మునుపటి నియమాలనే పాటించాలని డిమాండ్ చేశారు. ధర్నా నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.
రోడ్లను విస్తరించాలి
బన్నేరుఘట్ట జూపార్కును ప్రతిరోజూ వేలాది మంది సందర్శిస్తారు, కానీ ఆ రోడ్డు ఇరుకుగా ఉంది, ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయాలని బన్నేరుఘట్ట్ట గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మంజునాథ్ కోరారు. ప్రయాణం సాగక ఇటీవల ఒక గర్భిణీ రోడ్డుపై ప్రసవించిందని తెలిపారు.
బన్నేరుఘట్ట వాసుల ఆందోళన
జూపార్క్ ముందు బైఠాయింపు
సమస్య లేకుండా చూస్తాం: డీసీఎఫ్
డీసిఎఫ్ కాజల్ పాటిల్, జూపార్క్ ఈడీ సూర్య సేన్ నిరసనకారులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇంకా రాలేదు. సుప్రీంకోర్టు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాము. రైతులు, స్థానికులకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని కాజల్ పాటిల్ అన్నారు.
అడవి పేరుతో మమ్మల్ని వెళ్లగొట్టొద్దు


