గజ దాడిలో మహిళ బలి
● హాసన్ జిల్లాలో దుర్ఘటన
దొడ్డబళ్లాపురం: అడవి ఏనుగు దాడిలో మహిళ మరణించిన ఘటన హాసన్ జిల్లా మూగలి గ్రామంలో జరిగింది. గ్రామ నివాసి శోభ (40) మృతురాలు. వివరాలు.. శోభ కుటుంబానికి ఒకటిన్నర ఎకరాలో కాఫీ తోట ఉంది. మంగళవారం ఉదయం శోభ రోజులాగే కాఫీ తోటలో పనికి బయలుదేరింది. కాస్త దూరంలో ఆమె తల్లి రాజమ్మ వస్తోంది. ఇంతలో దారి మధ్యలో ఏనుగు వచ్చి శోభను కాళ్లతో తొక్కి చంపింది. రాజమ్మ పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. కుటుంబీకులు, ప్రజలు ఘటనాస్థలికి వచ్చి మృతదేహాన్ని తరలించారు. హంతక ఏనుగు సంచారంతో భయం నెలకొంది. కాగా, గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ ఈ ప్రాంతంలో కాఫీ తోటలో పని చేస్తున్న సుశీలమ్మ అనే మహిళతో పాటు వేర్వేరు రోజుల్లో మొత్తం నలుగురిని అడవి ఏనుగులు బలితీసుకున్నాయి. జనం అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలిపారు.
భార్యను వదిలి,
ప్రియురాలితో టెక్కీ..
యశవంతపుర: ప్రేమించి పెళ్లాడిన భార్యను మోసం చేసి ప్రియురాలితో గడుపుతున్న టెక్కీని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జెడ్రెలా జబ్, రెండేళ్ల నుంచి భార్యతో కలిసి నివసిస్తున్నాడు. భార్య ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగిని. భర్త ఖాళీగా ఉండడంతో అతనికి కూడా ఉద్యోగం ఇప్పించింది. ఆమె గర్భం దాల్చగా అబార్షన్ చేయించుకోవాలని సతాయించాడు. కూతురు పుట్టగా అప్పటి నుంచి వేధిస్తూ, కుల దూషణ చేస్తూ దూరంగా ఉంటున్నాడు. అతని వేధింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని జెడ్రెలా జబ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రియురాలి ఇంటిలో ఉండగా అతన్ని పట్టుకున్నారు.
కబ్జాల తొలగింపు
శివమొగ్గ: శివమొగ్గ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 31వ వార్డు పరిధిలోని గోపిశెట్టికొప్పలోని కెహెచ్‌బి లే ఔట్‌లోని రోడ్డు స్థలం, ఖాళీ స్థలాన్ని కొందరు కబ్జా చేసి గోడలు కట్టారు. ఈ నేపథ్యంలో పాలికె అధికారులు కబ్జాలను తొలగించారు. 60 అడుగుల రోడ్డు, ఖాళీ స్థలం, మరికొంత స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించి కాంపౌండ్ ఏర్పాటు చేశాడని ఫిర్యాదులు వచ్చాయి. పోలీసుల బందోబస్తుతో ఆక్రమణలను పడగొట్టి కోట్లాది రూపాయల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు శరణప్ప, హరీష్ కె, అన్వర్ బాబు, పూజార్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక ఒలింపిక్ క్రీడలతో చరిత్ర సృష్టిస్తాం
తుమకూరు: తుమకూరులో ఈనెల 16 నుంచి 22 వరకు జరగనున్న కర్ణాటక ఒలింపిక్ క్రీడలు చారిత్రాత్మక ఘట్టమని హోంమంత్రి పరమేశ్వర అన్నారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఏర్పాటు చేసిన కర్ణాటక క్రీడల పూర్వ ఉత్సవం, ఇండోర్ స్టేడియం నామఫలక ఆవిష్కరణ, స్టేడియం పునరుద్ధరణకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కర్ణాటక ఒలింపిక్ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. పోటీలను జనవరి 16న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభిస్తారన్నారు. 22న ముగింపు వేడుకలలో గవర్నర్ పాల్గొంటారన్నారు. క్రీడలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తుమకూరులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేసి పోటీలను నిర్వహిస్తామన్నారు. క్రీడాకారులకు, అథ్లెట్లకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా బడ్జెట్‌లో పలు అంశాలను సీఎం సిద్దరామయ్య పొందుపరుస్తారన్నారు.
గజ దాడిలో మహిళ బలి
గజ దాడిలో మహిళ బలి
గజ దాడిలో మహిళ బలి


