రెండో పంటకు తుంగభద్ర నీరందేనా?
రాయచూరు రూరల్ : తుంగభద్ర డ్యాం నుంచి రబీ సీజన్ రెండో పంటకు నీరు అందించే విషయంపై బుధవారం బెంగళూరులోని విధానసౌధలో నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం చేపట్టనున్నారు. రాయచూరు, కొప్పళ జిల్లాల్లో తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు రెండో పంటకు నీరు వదిలే అంశంపై చర్చ జరుగనుంది. కాగా తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్‌గేట్ల అమరిక విషయంలో ఆలస్యం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నవంబర్‌లో డ్యాంకు క్రస్ట్‌గేట్లు అమరికపై అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. డ్యాంలో 50 టీఎంసీల నీరున్నా గేట్ల ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. ఎడమ కాలువ నుంచి రెండో పంటకు నీరందించకుంటే రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని రైతులకు ఇబ్బందిగా మారనుంది. వందేళ్ల నాటి క్రస్ట్‌గేట్ల స్థానంలో 2027 ఫిబ్రవరిలో కొత్త క్రస్ట్‌గేట్లను అమర్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయంలో కళ్యాణ కర్ణాటక పరిధిలోని ఇంచార్జి మంత్రులు, శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టుకు రెండో పంటకు నీరు వదలడంతో పాటు 70 ఏళ్ల నాటి అక్విడక్ట్‌లు, రోడ్లు, డిస్ట్రిబ్యూటర్లు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.
నేడు బెంగళూరులో నీటిపారుదల సలహా సమితి సమావేశం
ఉత్కంఠగా ఎదురు చూస్తున్న
ఆయకట్టు రైతులు, నాయకులు


