చెరుకు రైతుల ఆందోళన తీవ్ర రూపం
సాక్షి,బళ్లారి: ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతులు అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెరుకు రైతులు చేపట్టిన ఆందోళన, నిరసన, ధర్నాలు తీవ్ర రూపం దాల్చాయి. బెళగావి జిల్లాలో చెరుకు రైతులు చేపడుతున్న ఆందోళన పతాక స్థాయికి చేరడంతో వేలాది మంది చెరుకు రైతులు చేరి రోడ్లు బంద్ చేసి అక్కడే కూర్చొని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం చెరుకు రైతులు వేలాది మంది చేరుకుని గోకాక్–అథణి, విజయపుర, చిక్కోడి, ముధోళ తదితర రహదారులపై బైఠాయించి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపేసి ఆందోళన చేశారు. ప్రతి టన్నుకు రూ.3500 ధర కేటాయించాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని మండిపడ్డారు. చెరుకు ఫ్యాక్టరీల యజమానులతో చర్చిస్తామని, ప్రతి టన్నుకు రూ.3200లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని జిల్లాధికారి మహమ్మద్ రోషన్ రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు.
ఆందోళన విరమణకు రైతుల ససేమిరా
అయితే రైతులు ససేమిరా అనడంతో పాటు ఆందోళన మరింత తీవ్రం చేశారు. తాము గత ఆరు నెలలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నామన్నారు. గిట్టుబాటు ధర కల్పించపోతే ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, రైతులకు కనీసం పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రూ.3500 ధర కల్పిస్తేనే ఆందోళన విరమిస్తామని సూచించారు. సీఎం సిద్దరామయ్య ఈ విషయంలో రంగప్రవేశం చేసి తమకు న్యాయం చేయాలన్నారు. ఫ్యాక్టరీ యజమానులతో చర్చించాలని కోరారు. రైతుల ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై విజయేంద్ర మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెరుకు రైతులు ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల పన్నులు వస్తున్నాయన్నారు. అయితే అదే చెరుకు రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
టన్నుకు రూ.3500 ధర
కేటాయించాలని డిమాండ్
రహదారులు బంద్ చేసి నిరనన తెలిపిన అన్నదాతలు
రైతుల ఆందోళనకు బీజేపీ మద్దతు: రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర


