ఇందిరా క్యాంటీన్ ప్రారంభమెప్పుడో?
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వం ఆకలి లేని రాష్ట్రాన్ని సృష్టించడానికి ఇందిరా క్యాంటీన్ అనే ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేసింది. ఇది పేదలకు, కార్మికులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. అయితే విజయనగర జిల్లా కొట్టూరులో నిర్మించిన పేదలకు పట్టెడన్నం పెట్టే నూతన ఇందిరా క్యాంటీన్ ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. ఐదు హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టూరులోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో ఇందిరా క్యాంటీన్ ఏర్పాటుకు అన్ని సన్నాహాలు చేసింది. ఇందిరా క్యాంటీన్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కానీ ఇప్పటి వరకు దానిని ప్రజాసేవకు అందుబాటులోకి తీసుకు రాకపోవడం విడ్డూరం. ఇందిరా క్యాంటీన్‌ను కొట్టూరులో వీలైనంత త్వరగా ప్రారంభిస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. ఈ ఇందిరా క్యాంటీన్‌ను త్వరలో ప్రారంభిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి పని కోసం వచ్చే రోజువారీ కూలీ కార్మికులు, ఆస్పత్రులను సందర్శించే పేద రోగులు, ప్రజలకు ఇది సహాయపడుతుందని స్థానిక ప్రముఖులు రమేష్, మంజునాథ్, అంజని, ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య విధానాన్ని అనుసరిస్తున్నారని వారు ఆరోపించారు. ఏదేమైనా పేదల ఆకలి తీర్చే ఇందిరా క్యాంటీన్ ప్రారంభించే గడియ ఎప్పుడు వస్తుందా? అని పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు.


