ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలి
సాక్షి,బళ్లారి: జమ్ముకశ్మీరులోని పహల్గాంలో జరిగిన మారణహోమాన్ని ఖండిస్తూ ముస్లింలు పెద్ద ఎత్తున నగరంలో నిరసన, మౌన ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం నగరంలోని ముస్లిం మత పెద్దలు, గురువులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ఉగ్రవాదుల తీరుపై మండిపడ్డారు. హత్యలు చేయమని ఏ ధర్మం(మతం)లోను బోధించలేదన్నారు. అలాంటిది దేశంలో హింసను రేకెత్తిస్తున్న ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించాలన్నారు. ప్రధాని, కేబినెట్ మంత్రులు ఈ విషయంలో తీసుకునే ఎలాంటి నిర్ణయానికై నా తామందరం కలిసికట్టుగా మద్దతు ఇస్తామన్నారు. దేశంలో శాంతిని కాపాడానికి, దేశంలో ఉగ్రవాదుల ఏరివేతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కశ్మీరులో జరిగిన హింస యావత్ ముస్లిం సమాజాన్ని కూడా కలిిచి వేసిందన్నారు. అమాయకులను దారుణంగా హత్య చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. పార్టీలకు, మతాలకు అతీతంగా దారుణాలను ఖండిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. దాదాపు 30 మంది మరణానికి కారకులైన ఉగ్రవాదులను తుడిచిపెట్టాలని అన్నారు. మన భారతదేశం కొట్టే దెబ్బకు వారి గుండెల్లో వణుకు పుట్టాలన్నారు. దేశంలో, ప్రపంచంలోని ఉగ్రవాదులందరికి ఒక హెచ్చరిక చేయాలన్నారు. అనంతరం జిల్లాధికారి ద్వారా కేంద్రానికి వినతిపత్రం సమర్పించారు. మాజీ బుడా అధ్యక్షుడు హుమయూన్‌ఖాన్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముస్లిం నేతలు పాల్గొన్నారు.
పహల్గాం దాడిపై కాంగ్రెస్ నిరసన
జమ్ముకశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై విక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదుల హింసను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి నగరంలోని గాంధీ విగ్రహం నుంచి రాయల్ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపివేయాల్సిందేనని నేతలు సూచించారు. ఉగ్రవాదం ప్రమాదకరమైందని, అణిచివేసేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అమాయకులైన పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల నామరూపాల్లేకుండా చేయాలన్నారు. ఇది ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఆలస్యం చేయకుండా ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం అసన్నమైందన్నారు. కార్యక్రమంలో మేయర్ ముల్లంగి నందీశ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కోనంకి రామప్ప, చానాళ్ వేఖర్‌తో పాటు కార్పొరేటర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
పహల్గాం ఉగ్రదాడిపై ఆందోళన
ఇటీవల కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, మారణహోమాన్ని ఖండిస్తూ శుక్రవారం కలబుర్గిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భజరంగదళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో పాకిస్థాన్ జెండాలు, స్టిక్కర్లను నేలపై అతికించి నిరసన తెలియజేయడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో పాకిస్థాన్‌కు విరుద్ధంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. హిందువులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించి వేయాలన్నారు. ఉగ్రవాదం తుదముట్టించాలని, వారి మూలాలు వెతికి పట్టుకుని తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా పాకిస్థాన్ జెండాలు, స్టిక్కర్లకు అతికించినందుకు భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు మాట్లాడుతూ ఆందోళనకారులు పాకిస్థాన్ జెండాలను నేలపై, స్టిక్కర్లను గోడలకు అతికించి నిరసన తెలుపుతామని ముందుగా తమకు తెలియజేయలేదన్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. భజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో జనం రోడ్లపైకి వచ్చి మరింత నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వారిని విచారణ చేసి విడిచి పెట్టారు.
ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా శిక్షించండి
హత్యలు చేయమని ఏ ధర్మమూ చెప్పదు
కశ్మీరు ఘటనపై ముస్లిం నేతల డిమాండ్
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలి


