ప్రైవేటు చదువు.. మరింత భారం
శివాజీనగర: బెంగళూరులో ప్రైవేటు స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీల ఫీజులు రూ. 80 వేల కంటే ఎక్కువగా ఉన్నాయి. పై తరగతులకు వెళ్లేకొద్దీ మరింత అధికం. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఇదే తీరు. అన్నిరకాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు మరో షాక్ ఎదురైంది. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే తల్లిదండ్రులకు ఈ సంవత్సరం నుండి ఆర్థిక భారం మరింత అధికం కానున్నది. రాష్ట్రంలో పలు ప్రైవేట్ పాఠశాలు ఫీజులను భారీ మొత్తంలో పెంచడమే కారణం. అనేక ప్రైవేటు పాఠశాలల్లో 15 నుంచి 20 శాతం వరకు అడ్మిషన్ ఫీజులను పెంచాయి. స్కూళ్ల నిర్వహణ ఖర్చు, సిబ్బంది జీతం, వాహనాలు, డీజిల్ ధరల భారం అని పలు కారణాలు చూపుతూ బాదుడును సమర్థించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డీజిల్‌పై సుంకాన్ని పెంచడం తెలిసిందే. నీరు, ఆస్తిపన్ను సహా పలు రకాల సుంకాలను చెల్లించడం, ఉపాధ్యాయులు, సిబ్బంది జీతాల చెల్లింపులు అధికం అయినందున ఫీజులను పెంచడం అనివార్యమైందని ప్రైవేట్ పాఠశాలల సంఘాల ప్రతినిధులు తెలిపారు. కొన్ని స్కూళ్లలో 30 శాతం వరకూ పెంచడం గమనార్హం.
డీజిల్ సుంకం చూపి వాహన ఫీజు పెంపు
స్కూల్ వాహనంపై ఇదివరకే ఫీజు పెంచారు, ప్రతి కుటుంబానికి నెలకు 500 నుంచి 600 రూపాయల వరకు అదనంగా భారం పడుతోంది. వాహన ఫీజు పెంచినందుకు తల్లిదండ్రులు వ్యతిరేకతను వ్యక్తం చేసినా స్పందన లేదు. ఇలా ఉండగా పుస్తకాల, నోటు బుక్‌ల ధరలను కూడా ఇష్టానుసారం పెంచడమైనది. పిల్లల తల్లిదండ్రులకు ఇది తీవ్ర భారమవుతోంది. ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి, స్కూలు ఫీజులను పెంచడం సరి కాదని తెలిపారు.
20 శాతం ఫీజులు పెంచిన వైనం
ఇప్పటికే బాదుడుతో జనం లబోదిబో
విద్యార్థుల తల్లిదండ్రులకు భారీ షాక్
నియంత్రణ ఎక్కడ?
సిలికాన్ సిటీ అనే పేరును సాకుగా తీసుకుని బెంగళూరులోని వేలాది ప్రైవేటు స్కూళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆకర్షణీయమైన పేర్లు పెట్టుకున్న స్కూళ్లు ఏబీసీడీలను ఏర్పడానికే ఏటా లక్షల రూపాయలను తల్లిదండ్రుల నుంచి పిండుకుంటున్నాయి. ఫీజుల వసూలుకు ఎలాంటి ప్రాతిపదిక ఉండదు. ప్రభుత్వ నియంత్రణ అసలే ఉండదు. పెద్దలకు ముడుపులు చెల్లిస్తూ, పిల్లలపై ఫీజుల దోపిడీని కొనసాగిస్తుంటారు. ఆయా స్కూళ్ల వెబ్‌సైట్‌లలో చూస్తే ఫీజులు నామమాత్రమేనని సమాచారం ఉంటుంది. నమ్మి వెళ్తే.. పది ఇరవై అంశాలను ప్రస్తావించి రుసుము రూ.లక్ష పైనే అంటారు. ఇది ఎల్‌కేజీ, యూకేజీకి మాత్రమే. ఆరు ఏడు తరగతుల ఫీజులు ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ విద్యార్థులు చెల్లించే రుసుముల కంటే అధికమైనా ఆశ్చర్యం లేదు. మధ్య తరగతి, వేతన జీవులు గత్యంతరం లేక చదివిస్తుంటారు.
ప్రైవేటు చదువు.. మరింత భారం
ప్రైవేటు చదువు.. మరింత భారం


