నీటి సమస్య తలెత్తకుండా చూడండి
హొసపేటె: కొప్పళ జిల్లాలోని ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ, కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి, కొప్పళ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శివరాజ్ తంగడి ఎస్ సూచించారు. కొప్పళ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి తాగునీరు, పశుగ్రాసం సమస్యలపై ఆరా తీశారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు. జిల్లా పంచాయతీ పరిధిలో నీటి సమస్య కనిపిస్తే తాలూకా పంచాయతీ కార్యనిర్వహాక అధికారులు స్వయంగా గ్రామాలను సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నీటి సమస్యలు తలెత్తే గ్రామాల్లో ఏం చేయాలో అధికారులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు ఫోన్ చేసినప్పుడు, వారి స్పందించి వారు చెప్పిన సమస్యలను పరిష్కరించాలన్నారు. వడ్రంగి, కనకగిరి ప్రాంతంలో నీటి సమస్య సర్వసాధారణమైందన్నారు. ప్రజలకు తాగునీరు అందించడానికి శాశ్వత పరిష్కారం కనుగొనడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని, గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి కనిపిస్తే అధికారులు సమావేశం నిర్వహించి నీటి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించారు.
కొప్పళ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శివరాజ్ తంగడి


