బళ్లారిటౌన్: నగరంలోని కేఈబీ సర్కిల్ నుంచి కర్ణాటక గ్రామీణ బ్యాంక్ వరకు ఎస్‌హెచ్– 132 బసవేశ్వరనగర్ రోడ్డు వెడల్పు పనులు చేపట్టి దాదాపు 10 నెలలు కావస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నందున స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 400 మీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డు పనులు గతేడాది మే నెలలో ప్రారంభించారు. అయితే ఇంత వరకు రెండు వైపులా ఓపెన్ డ్రైనేజీ, అండర్ డ్రైనేజీ పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యం అవుతున్నాయని సామాజిక కార్యకర్త మేకల ఈశ్వర్‌రెడ్డి ఆరోపించారు. 21వ వార్డు పరిధిలోని ఈ రోడ్డులో కూరగాయల మార్కెట్, ఆస్పత్రులు, హోటళ్లు, కమర్షియల్ షాపులు ఉన్నందున రోడ్డులో ఉన్న దుమ్ము, ధూళి అంతా దుకాణాల్లోకి చొరబడుతోందని వర్తకులు మండిపడుతున్నారు. ఇక ఈ రోడ్డుకి ఆనుకొని ఉన్న బసవేశ్వరనగర్ వాసులు తమ ఇళ్లలోకి ధూళి, దుమ్ము చేరుతున్నందున ఎప్పుడూ తలుపులు, కిటికీలు మూసుకొని ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిల్లులు చెల్లించనందుకే జాప్యం
పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగ్గా విడుదల చేయక పోవడంతోనే పనులు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంట్రాక్టర్లు ముందస్తుగా లక్షల్లో పెట్టుబడి పెట్టినా అధికారులు బిల్లులు మంజూరు చేయక పోవడంతో కాలయాపన జరుగుతున్నట్లు పలువురు వాపోతున్నారు. జాతీయ రహదారిలో ఏడాదిలో వందల కొద్ది కి.మీ. మేర రోడ్డు అభివృద్ధి చేస్తుండగా రాష్ట్ర రహదారిలో 400 మీటర్ల రోడ్డు పనులు నిర్వహించేందుకు 10 నెలలు కావాలా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇదే రాష్ట్ర రహదారిలో చాగనూరు వద్ద రాష్ట్ర రహదారుల మండలి టోల్‌గేట్‌ను నిర్మించి డబ్బులు దండుకుంటోంది. టోల్‌గేట్‌లో డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు టోల్‌గేట్ నుంచి కేవలం 10–12 కి.మీ. దూరంలో ఉన్న బసవేశ్వరనగర్ రోడ్డును ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది స్థానికుల వాదన. ఇప్పటికై నా రాష్ట్ర రహదారుల నిగమ అధికారులు, మహానగర పాలికె అధికారులు, పాలక మండలి ఈ రోడ్డు పనులను త్వరగా ముగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
10 నెలలుగా పూర్తి కాని రోడ్డు పనులు
దుమ్ము, ధూళితో దుకాణదారుల పాట్లు
రహదారి పనుల పూర్తికి మీనమేషాలు


