డెలివరీ బాయ్‌కి కత్తిపోట్లు
నిందితులకు గ్రామస్తుల దేహశుద్ధి
కోలారు : కొరియర్ పార్శిల్ ఇచ్చే విషయంపై కొరియర్ డెలివరీ బాయ్, మరో యువకుడి మధ్య గొడవ ప్రారంభమై కత్తిపోట్లకు దారి తీసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. అంతకు ముందు కొరియర్ బాయ్, యువకుడి మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కొరియర్ బాయ్ నగరంలోని కీలుకోట నివాసి పవన్, అతని సోదరుడు మోహన్‌లతో బైక్‌లో తాలూకాలోని ముదువాడి హొసహళ్లి గ్రామానికి చేరుకుని గ్రామానికి చెందిన చేతన్, యువరాజ్‌లతో గొడవకు దిగారు.
ఆగ్రహం కట్టలు తెంచుకుని పవన్, మోహన్‌లు తమ వద్ద ఉన్న కత్తితో చేతన్, యువరాజ్‌ల కడుపులో పొడిచారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన చేతన్, యువరాజ్‌లను గ్రామస్తులు వెంటనే కోలారు ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనతో ఉద్రిక్తులైన గ్రామస్తులు గుంపుగా చేరి పవన్, మోహన్‌ల దుస్తులు ఊడదీసి కరెంటు స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న కోలారు రూరల్ పోలీసులు హూటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తుల నుంచి మోహన్, పవన్‌లను విడిపించి స్టేషన్‌కు తీసుకు వచ్చారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


