ఉగాది వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి,బళ్లారి: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు తెలుగు ప్రజలు, కన్నడిగులు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆదివారం ఉగాదిని పురస్కరించుకొని పండగు సరుకుల కోసం శనివారం ప్రజలు మార్కెట్లకు పోటెత్తారు. బళ్లారిలోని బెంగళూరు రోడ్డులోని దుకాణాలు కిటకిటలాడాయి. పూలు, పండ్లు, దుస్తుల దుకాణాలు కొనుగోలు దారులతో నిండిపోయాయి.మరో వైపు ఇళ్లను శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణాలతో అలంకరించుకున్నారు. ఉగాది పచ్చడి చేసుకునేందుకు వేపపూతను సేకరించుకున్నారు. ఖరీఫ్ సీజన్‌లో తుంగభద్ర ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు చేతికందడంతో పండుగను ఉత్సాహంగా చేసుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు.
జంట నగరాల్లో ఉగాది వేడుకలు
హుబ్లీ: జంట నగరాలలో ఉగాది ఉత్సవాలు శనివారం నుంచే ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలతో పాటు విశేష కార్యక్రమాలను నిర్వహించారు. నవనగర్ సమీపంలోని పంచాక్షరిలోని కాళికాదేవి మహాభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించి మహామంగళహారతి ఇచ్చారు. అలాగే ధనధాన్యాలను సమర్పించి సేవలు నెరవేర్చారు. ఆదివారం పాడ్యమి రోజు కాళిక దేవికి సందేశ పోతేదార కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నూతన పల్లకీ సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. పల్లకీని బన్ని మహంకాళి ఆలయం నుంచి పూర్ణకుంభాలు, వివిధ వాయిద్యాల ప్రదర్శనతో ఆలయానికి తీసుకువస్తారు.
ఉగాది వేడుకలకు సర్వం సిద్ధం


