బళ్లారిలో బీజేపీ సమరనాదం
సాక్షి,బళ్లారి: జనవరి 1వ తేదీన బళ్లారి నగరంలో మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి స్వగృహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్ కట్టడం, ఈ సందర్భంగా ఘర్షణ జరిగి కాల్పుల్లో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త మరణం నేపథ్యంలో బీజేపీ ఆందోళనలను ఉధృతం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని, కేసు ను సీబీఐకి అప్పగించాలని బీజేపీ నాయకులు శనివారం నగరంలో ఆందోళన చేశారు. ఏపీఎంసీలో సభ జరిపి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్, బీజేపీ పరిశీలకుడు పొంగులేటి సుధాకరరెడ్డి, గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు తదితర నాయకులు పాల్గొన్నారు.
ఆందోళనలు తప్పవు
నాయకులు ప్రసంగిస్తూ కాల్పుల ఘటనకు కారణమైన ఎమ్మెల్యే భరత్‌రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. అరెస్ట్ చేసి, సీబీఐకి అప్పగించకపోతే దశలవారీగా పోరాటం చేస్తామన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా బళ్లారి ఘటనపై తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు.
కాల్పుల ఘటనలో ఎమ్మెల్యే భరత్‌రెడ్డిని అరెస్టు చేయాలి
కాంగ్రెస్ సర్కారు పాలనలో అధోగతి
భగ్గుమన్న కాషాయదళ నేతలు


