సీఎం ఇలాకాలో మహిళా ఉద్యోగినికి దూషణలు
మైసూరు: సీఎం సిద్దరామయ్య సొంత నియోజకవర్గం వరుణలో ఓ కబ్జాదారు మహిళా ఉద్యోగినిని దూషించాడు. గూడేమదనహళ్లిలో గ్రామాధికారిణి భవ్య, గ్రామ సహాయకుడు నవీన్‌కుమార్... నిమ్హాన్స్ మోడల్ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కోసం సర్కారు భూమిని పరిశీలించడానికి వెళ్లారు. స్థానికుడు జి.ఎం.పుట్టస్వామి సర్కారు భూమిని ఆక్రమించి వక్కతోట సాగిస్తున్నాడు. భవ్య ఆ తోటను పరిశీలిస్తుండగా పుట్టస్వామి, ఆమెను దుర్భాషలాడి చంపేస్తానని బెదిరించాడు. నవీన్‌కుమార్ దీనిని వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కుని వీడియోలు తీసేశాడు. ఆస్పత్రి కోసం మా భూమిని గుర్తించిన తహశీల్దార్‌ను తొలగించాలని చిందులు వేశాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నిన్ను చంపేస్తాను, ఏమనుకున్నావు అని వీరంగం చేశాడు. అతని ఆగడాలపై భవ్య మైసూరు రూరల్ సౌత్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
స్కూటరిస్టును బలిగొన్న కుక్క
దొడ్డబళ్లాపురం: వీధి కుక్క వెంటబడడంతో దాని నుండి తప్పించుకునే ప్రయత్నంలో స్కూటరిస్టు అదుపుతప్పి గోడను ఢీకొనడంతో చనిపోయాడు. ఈ సంఘటన బెళగావి జిల్లా అథణి పట్టణంలోని కుంబార వీధిలో చోటుచేసుకుంది. విశ్వనాథ్ శిరోళ (44) స్కూటర్‌లో వెళ్తుండగా వీధికుక్క వెంటబడింది. అది కరుస్తుందనే భయంతో వేగంగా వెళ్లసాగాడు. ఈ క్రమంలో అదుపు తప్పి రోడ్డుపక్కన ఒక ఇంటి గోడను ఢీకొనగా తీవ్ర గాయాలై అక్కడే మరణించాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
దాసయ్యను సీఎం చేసినా
సరే: మంత్రి జమీర్
హుబ్లీ: రాష్ట్రంలో ఏ క్రాంతీ లేదు, 2028 వరకు సిద్దరామయ్యే సీఎంగా కొనసాగుతారని రాష్ట్ర మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2028 వరకు సిద్దునే సీఎంగానే ఉంటారు, మా పార్టీ హైకమాండ్ వీధి దాసయ్యను సీఎంగా ప్రకటించినా మేం ఒప్పుకుంటాం. అయితే సిద్దునే సీఎంగా కొనసాగుతారనే విశ్వాసం ఉంది. నవంబర్ క్రాంతి, సంక్రాంతి క్రాంతి అన్నా కూడా ఏ క్రాంతీ జరగలేదు. ఇప్పుడేమో ఉగాది అనవచ్చు. అదీ జరగదు’ అని అన్నారు. డీసీఎం డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం, పార్టీ పనుల కోసం ఢిల్లీకి వెళ్లి ఉంటారన్నారు. ఈ నెల 24న హుబ్లీ స్లం బోర్డు ఆధ్వర్యంలో 42,345 ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామన్నారు.
టెన్త్ పేపర్ రూ.30 మాత్రమే
● లీకేజీ విచారణలో వెల్లడి
యశవంతపుర: పదో తరగతి సన్నాహక పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీలో కొత్త సంగతుల బయటపడ్డాయి. పేపర్లను పొందిన విద్యార్థులను బెంగళూరు సీసీబీ పోలీసులు విచారించగా రూ.30 లకు కొనుగోలు చేశామని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. మరికొందరు విద్యార్థులు రూ.50, రూ.100కు కొన్నారు. పేపర్లు అమ్మిన ఉపాధ్యాయుల బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నారు. తమ ఐడీల ద్వారా ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అమ్ముకున్నట్లు నిందిత ఉపాధ్యాయులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. పలువురు ఉపాధ్యాయులను అరెస్టు చేయడం తెలిసిందే. మరో పక్క ఉపాధ్యాయుల కుటుంబసభ్యుల అకౌంట్లను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. లీకేజీ దందా తరువాత అనేక మంది విద్యార్థులు సోషల్ మీడియా ఖాతాలను తొలగించుకున్నారు.


