డ్రగ్స్‌ను అరికట్టాలి, శాంతిభద్రతలను కాపాడాలి
శివాజీనగర: రాష్ట్రంలో పోలీసులు డ్రగ్స్ మీద కార్యాచరణను తీవ్రతరం చేసి అడ్డుకోవాలి. దళితులు, మహిళలు, పిల్లలపై దాడులను అరికట్టి శాంతిభద్రతలను కాపాడుతూ పోలీస్‌స్టేషన్‌లతో ప్రజలకు సత్సంబంధంగా ఉండేటట్లు చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని డీజీపీ ఆఫీసులో ఐపీఎస్‌లతో సీఎం వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మత ఘర్షణలు, అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరాలను కట్టడి చేయాలి. నేరాలు, దొంగతనం పెరిగాయంటే పోలీసు గస్తీ వ్యవస్థ విఫలమైందని అర్థం. ఇదే పరిస్థితి కొనసాగితే డీసీపీలు, ఎస్పీలను బాధ్యులుగా చేయాల్సి వస్తుంది’ అని సీఎం హెచ్చరించారు.
పోలీసులే నేరాలకు పాల్పడితే..
మనది లౌకికవాద దేశం. రాష్ట్రంలో మతఘర్షణలు జరగలేదంటే శాంతిభద్రతలకు బాగున్నాయనేందుకు నిదర్శనమని సీఎం అన్నారు. కర్ణాటకను డ్రగ్స్ విముక్త రాష్ట్రంగా చేయాలి. మూలం నుంచే డ్రగ్స్ మాఫియాను రూపుమాపాలి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో శిక్షలు పడుతున్నది చాలా తక్కువ. ప్రభుత్వం పోలీసులకు నిర్భయంగా పనిచేసే వాతావరణం కల్పించింది. ఇది ప్రజలకు అనుకూలం అయ్యేటట్లు చూసుకోవాలి అని తెలిపారు. కాగా, గత ఏడాది 88 కేసుల్లో పోలీసులే నిందితులు కావడం చాలా సిగ్గుచేటని సీఎం మండిపడ్డారు. పోలీసు సిబ్బంది నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు. ఈ సమావేశంలో హోం మంత్రి జీ.పరమేశ్వర్, డీజీపీ ఎంఏ సలీం, సీనియర్ ఐపీఎస్‌లు పాల్గొన్నారు.
ఐపీఎస్‌ల భేటీలో సీఎం సిద్దు ఆదేశం


