వేణుగోపాల రథోత్సవం
మైసూరు: జిల్లాలోని సరగూరు సమీపంలోని హులికుర గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి జాతర, రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయాన్ని సుందరంగా అలంకరించి జాతర నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పుష్పమాలలతో తీర్చిదిద్ది మంగళ వాయిద్యాలతో తేరులో ప్రతిష్టించారు. స్వామి నామాన్ని జపిస్తూ వేలాదిమంది భక్తులు తేరును లాగారు. అరటిపండ్లు, దవనాన్ని తేరుపైకి విసిరారు. జానపద కళాకారుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.
టిప్పర్‌ను బైక్ ఢీ..
ముగ్గురు యువకుల మృతి
దొడ్డబళ్లాపురం: త్రిబుల్ రైడింగ్, అతి వేగం ముగ్గురు యువకుల ప్రాణం తీసింది. బెంగళూరు రూరల్‌లోని దేవనహళ్లి తాలూకా బూదిగెరె రోడ్డులో అదుపుతప్పిన బైక్ డివైడర్‌ను ఢీకొని అదే వేగంతో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు క్షణాల్లో మరణించారు. మృతులు హుణసమారనహళ్లిలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీ విద్యార్థులని తెలిసింది. శనివారం ఉదయం ఒకే బైక్‌పై ముగ్గురూ బయల్దేరారు. అతి వేగం కారణంగా అదుపుతప్పింది. ప్రమాదంలో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఒక యువకుని పేరు తౌసిఫ్ గా తెలిసింది. దేవనహళ్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాద దృశ్యం స్థానిక ఇళ్ల సీసీ కెమెరాలలో రికార్డయింది.
జూలో పులి కన్నుమూత
మైసూరు: మైసూరు నగరంలోని ప్రసిద్ధ చామరాజేంద్ర మృగాలయంలో పులి మరణించింది. తార– రాకీ అనే పులుల జంటకు 2022లో జన్మించిన ప్రీతి అనే 3 సంవత్సరాల 9 నెలల వయసున్న ఆడ పులి చనిపోయింది. గత 5 రోజులుగా ఆహారం తీసుకోవడం లేదు. పులి శరీరంలోని రక్తం కలుషితం కావడంతో వెటర్నరీ వైద్యులు చికిత్స అందించారు, కానీ చికిత్స ఫలించక శుక్రవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూసింది.
మెట్రో చార్జీలను పెంచితే ధర్నా చేస్తా: ఎంపీ తేజస్వి
శివాజీనగర: బెంగళూరు మెట్రో రైలులో టికెట్ ధరలు దేశంలో ఏ మెట్రోలో లేనంత ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. కానీ మరోసారి ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ, చైన్నె, కొచ్చి మెట్రోల్లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి ఉన్న చార్జీ కంటే బెంగళూరు మెట్రోలో రెట్టింపు రేటు ఉందని బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో మళ్లీ బీఎంఆర్‌సీఎల్ 5 శాతం చార్జీలను పెంచడానికి సిద్ధమైంది, ఇదే జరిగితే మెట్రో స్టేషన్ ముందు ధర్నా చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, బీఎంఆర్‌సీఎల్ ప్రజలను మోసగిస్తున్నాయని ఆరోపించారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు ధరల పెంపును అడ్డుకోవాలన్నారు.
అబ్కారీ డీసీ..
రూ.25 లక్షల లంచం
బనశంకరి: బెంగళూరులో భారీ మొత్తంలో లంచం తీసుకుంటున్న ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ జగదీశ్ నాయక్‌ను లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేశారు. మైక్రో బ్రూవరీ లైసెన్సుల కోసం రూ.75 లక్షల లంచం కావాలని డిమాండ్ పెట్టి, మొదటి కంతుగా రూ.25 లక్షలు స్వీకరిస్తుండగా బ్యాటరాయనపుర ఎకై ్సజ్ కార్యాలయంలో లోకాయుక్త పోలీసులు శనివారం దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనకు సహకరించిన అబ్కారీ కానిస్టేబుల్ లక్కప్పను నిర్బంధించారు. వివరాల ప్రకారం మైక్రో బ్రూవరి, సీఎల్ 7 లైసెన్సుల కోసం వ్యాపారి లక్ష్మినారాయణ దరఖాస్తు చేశారు. మంజూరు చేయాలంటే రూ.80 లక్షల ముడుపులు ఇవ్వాలని జగదీశ్‌నాయక్ డిమాండ్ చేశారు. మళ్లీ ఆ మొత్తాన్ని రూ.2.25 కోట్లకు పెంచారు. చివరికి రూ.75 లక్షలకు ఒప్పుకున్నారు. మొదట రూ.25 లక్షలను తీసుకోగా లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. అప్పు చేసి ఈ డబ్బులు తెచ్చానని బాధితుడు తెలిపారు. ఎకై ్సజ్‌శాఖలో లంచం ఇవ్వకపోతే ఏ పనీ జరగదని వాపోయాడు.
వేణుగోపాల రథోత్సవం


