పండుగకు వస్తుండగా మృత్యు పంజా
సాక్షి,బళ్లారి: పొట్టకూటి కోసం సుదూర ప్రాంతానికి వెళ్లి ఉగాది పండుగను స్వగ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా చేసుకోవాలని వస్తున్న వారిపై మృత్యువు పంజా విసిరింది. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెర తాలూకా హెగ్గేరి ఫ్యాక్టరీ సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. చెళ్లకెర తాలూకా తిమ్మననహళ్లి లంబాడిహట్టి గ్రామానికి చెందిన అన్నదమ్ములు కుమారనాయక్(46),శంకర్‌బాయ్(65)లు బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లారు. టెంపో వాహనం, కారు కొనుగోలు చేసుకుని బాడుగులకు తిప్పుతూ జీవనం సాగిస్తున్నారు. ఉగాది పండుగను స్వగ్రామంలో చేసుకోవాలని భావించి రెండు కుటుంబాల వారు టెంపో వాహనంలో బయల్దేరారు. మరో గంటలో ఊరికి చేరుకోవాల్సి ఉండగా చెళ్లకెర తాలూకా హెగ్గేరి ఫ్యాక్టరీ సమీపంలో టిప్పర్ ఎదురైంది. రెండు వాహనాలు డీకొనడంతో కుమారనాయక్, శంకర్‌భాయ్‌తోపాటు శ్వేతా(38) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందారు. లక్ష్మీబాయి, ప్రశాంత్, శైలజ, పుష్పావతి, ప్రీతమ్‌కుమార్, తిప్పేస్వామితోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చెళ్లకెర పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను, మృతదేహాలను చెళ్లకెర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేపట్టారు.
మిన్నంటిన రోదనలు
ప్రమాదం విషయం తెలిసి బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న తమ వారి చూసి విలపించారు. గంటలోనే ఇంటికి వస్తామని చెప్పి కానరాని లోకాలకు వెళ్లారా అంటూ రోదించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని గొల్లరహట్టి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రోడ్డు దాటుతుండగా బైక్‌ను కారు ఢీకొట్టింది. బైకర్‌తోపాటు మరొకరు తీవ్రంగా గాయపడగా హోస్పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. హగరిబొమ్మనహళ్లి పోలీస్‌లు కేసు దర్యాప్తు చేపట్టారు.
టెంపో ట్రావల్ వాహనం, టిప్పర్ ఢీ
చిత్రదుర్గం జిల్లా చెళ్లకెర తాలూకాలో ఘటన
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
బడుగుల కుటంబాల్లో మిన్నంటిన విషాదం
పండుగకు వస్తుండగా మృత్యు పంజా


