రాయచూరు రూరల్ : ఈఏడాది కల్యాణ కర్ణాటక(క–క)లోని ఆరు జిల్లాల్లో తీవ్ర కరువు సంభవించినా కేంద్ర, రాష్ట్ర సర్కార్లు నిర్లక్ష్యం వహించాయి. సరైన వర్షాలు లేక పంటలు పండక పోవడంతో పశువులకు పశుగ్రాసం కూడా లభించని దుిస్థితి నెలకొంది. అనావృష్టితో ఆయా జిల్లాలో రైతులు పొలాల్లో వేసుకున్న పంటలు సరిగా పండక, పశుగ్రాసం లేక మూగజీవాలు తల్లడిల్లుతున్నా కనీసం పంట నష్టపరిహారం అందించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహిస్తున్నాయి. బాధితులు ఎలా జీవితం గడపాలనే ఆలోచనలో ఉన్న సందర్భంలో ఏదైనా పరిహారం వస్తుందన్న ఆశతో కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండటంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్ణాటకలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించాల్సిన తహసీల్దార్లు లేకపోవడంపై రైతుల్లో విచారం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పేదలు అన్నమో రామచంద్రా అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మౌనం వహించడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. చెరువులు, కుంటలు, బావులు, వాగుల్లో నీరు లేకపోవడంతో పశువులను మేపడానికి పశుగ్రాసం లభించక రైతులు కబేళాలు, జాతరలు, సంతల్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.55 లక్షలకు పైగా పశువులను విక్రయించినట్లు సమాచారం. జిల్లాలో 25 వేల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరం ఉందని పశు సంవర్ధక శాఖ అధికారులు జిల్లాధికారికి మూడు నెలల క్రితమే ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు. తుంగభద్ర ఎడమ కాలువ కింద వరి పంటను తక్కువ ప్రమాణంలో పండించడంతో పశుగ్రాసం కొరత ఏర్పడిందని అధికారులు అంటున్నారు.
సంతలు, జాతరల్లో తక్కువ ధరకు
పశువుల అమ్మకం
క–కలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
కరువు విలయం.. కబేళాలకు విక్రయం
కరువు విలయం.. కబేళాలకు విక్రయం


