దొడ్డబళ్లాపురం: బైక్‌పై వెళ్తున్న విద్యార్థిని కిందపడగా వెనుక నుంచి వచ్చిన క్యాంటర్ ఆమె పైనుండి దూసుకెళ్లగా మరణించిన సంఘటన బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారి మార్గంలో చోటుచేసుకుంది. మాగడి తాలూకా బ్యాడరహళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు, జగదాంబ దంపతుల కుమార్తె ధనుశ్రీ (20) మృతురాలు. వివరాలు.. ఈమె మంగళూరు ఆళ్వాస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. గ్రామంలో జాతర ఉండడంతో వచ్చింది. తిరిగి మంగళూరు వెళ్లేందుకు తమ్ముడు రేణుకేశ్‌తో కలిసి బైక్‌పై కుణిగల్ రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. తాళెకెరె హ్యాండ్ పోస్టు వద్ద జాన్సన్ ఫ్యాక్టరీ ముందు ప్రమాదవశాత్తు బైక్ పైనుండి కిందపడింది. వెనుకనే వేగంగా వచ్చిన క్యాంటర్ ఆమైపె దూసుకుపోయింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గతంలోనూ హనీట్రాప్
ఉంది: యతీంద్ర
మైసూరు: రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకే హనీట్రాప్ జరిగిందని అనడం సరికాదని, గతంలో బీజేపీ ప్రభుత్వంలోనూ హనీట్రాప్ జరిగిందని, తాజాగా అదే తరహా ప్రయత్నం జరిగిందని, దీనివెనుక పెద్ద కుట్ర ఉందని హస్తం ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు ద్వారానే ఈ కుట్ర కోణం బయట పడుతుందన్నారు. బుధవారం మైసూరులో మీడియాతో యతీంద్ర మాట్లాడుతూ గత బీజేపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం బసవరాజు బొమ్మైతో పాటు సుమారు 17 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల హనీట్రాప్ వీడియో ఉందని, మీడియాలో ప్రసారం కాకుండా కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని రావడం వల్ల అది అప్పట్లో ఆగిపోయిందని చెప్పారు. ఈ విధమైన హనీట్రాప్‌ను బీజేపీ నేతలే చేస్తున్నారని, వారికి తమ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హతే లేదని అన్నారు. హనీట్రాప్ ద్వారా బ్లాక్‌మెయిల్ చేసే వారికి కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ నుంచి గ్రేటర్
బెంగళూరు బిల్లు వెనక్కి
శివాజీనగర: బెంగళూరులో సప్త పాలికెను ఏర్పాటు చేసి, ఒక ప్రాధికారను నెలకొల్పి దానికి సీఎం అధ్యక్షత వహించాలని, ఇంకా పలు ముఖ్యాంశాలను చేర్చి రూపొందించిన గ్రేటర్ బెంగళూరు బిల్లును గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వెనక్కి పంపించారు. దీంతో కాంగ్రెస్ సర్కారుకు మరోసారి ఇబ్బంది కలిగింది. గవర్నర్ కొన్ని స్పష్టతలను కోరుతూ వెనక్కి పంపించారు. స్పష్టీకరణతో బిల్లును మళ్లీ గవర్నర్‌కు పంపనున్నట్లు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్.కే.పాటిల్ తెలిపారు. 2023 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 119 బిల్లులను రాజ్‌భవన్ ఆమోదించింది. ఇందులో 83 బిల్లులను చట్టంగా జారీ చేయడమైనది. నాలుగు బిల్లులు గవర్నర్ వద్ద ఉన్నాయి, 7 బిల్లుల గురించి గవర్నర్ స్పష్టీకరణను కోరారు. ఐదు బిల్లులను పరిశీలన కోసం రాష్ట్రపతికి పంపించారు అని తెలిపారు.
ముగ్గురు ఆఫ్రికన్ల నిర్బంధం
బనశంకరి: నగరంలో అక్రమంగా మకాం వేసిన ముగ్గురు విదేశీ పౌరులను సీసీబీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆఫ్రికాలోని సూడాన్, నైజీరియా దేశానికి చెందిన మహమ్మద్ ఇబ్రహీం అహ్మద్, ఖలీద్ ఫక్రీ మహమ్మద్, నైజీరియా ఇమ్ముయల్ అనే ముగ్గురు పట్టుబడ్డారు. బాణసవాడి, రామమూర్తినగర పోలీస్‌స్టేషన్ల పరిధిలో అనధికారికంగా ముగ్గురు స్థిరపడ్డారని పోలీసులు తెలిపారు. చదువుల వీసా కింద వచ్చి నగరంలోని ప్రైవేటు కాలేజీలో చేరారు. వీసా అవధి ముగిసినప్పటికీ స్వదేశాలకు వెళ్లకుండా మకాం పెట్టారు. ఇది తెలిసి బుధవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేసి దొడ్డగుబ్బిలోని ఆశ్రయ కేంద్రంలో ఉంచారు.
అల్లుని హత్యకు భారీ కుట్ర
● విచారణలో తల్లీకూతుళ్ల వెల్లడి
యశవంతపుర: మాగడి రియల్టర్ లోకనాథసింగ్ (37) హత్య కేసులో భార్య, అత్తలను బెంగళూరు బీజీఎస్ లేఔట్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. విచారణలో కొత్త కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అల్లుడంటే సరిపడని అత్త హేమా, ఆమె కూతురు యశస్వి పుస్తకాలు చదివి, ఇంటర్నెట్‌లో శోధించి హత్యకు పథకం వేశారు. హౌ టు కిల్ పుస్తకం చదివిన హేమా భోజనంలో నిద్రమాత్రలను కలపాలని కూతురికి సూచించింది. గత ఆదివారం రాత్రి నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం తాగించి, మత్తు పదార్థం కలిపిన ఆహారం తినిపించిన తరువాత అతన్ని ఇద్దరూ గొంతు కోసి హతమార్చారు. భార్య యశస్వికి చెందిన ప్రైవేట్ వీడియోను పెట్టుకొని లోకనాథ్‌సింగ్ బెదిరించేవాడని, తాను మరో మహిళను పెళ్లి చేసుకొంటానని భార్య, అత్తకు చెప్పేవాడు. ఇది తట్టుకోలేక అంతమొందించినట్లు విచారణలో తెలిపారు.
క్యాంటర్ దూసుకెళ్లి బీటెక్ విద్యార్థిని మృతి


