హొసపేటె: స్వాతంత్య్ర పోరాటంలో గొప్ప విప్లవకారులు, వీర అమరవీరులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏఐడీఎస్‌ఓ కార్యకదర్శి పంపాపతి తెలిపారు. ఆదివారం భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ నగరలో ఏఐడీఎస్‌ఓ, ఏఐడీవైఓ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా క్రీడామైదానం, బీసీఎం హాస్టళ్లలో ఏర్పాటు చేసిన భగత్‌సింగ్ దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. బ్రిటిష్ వారి అణిచివేతకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం రాజీ పడకుండా పోరాడి నవ్వుతూ ఉరి కంబాన్ని ఎక్కిన గొప్ప విప్లవకారుడు భగత్‌సింగ్ అని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛను తెచ్చే విప్లవ సందేశాన్ని విద్యార్థులు, యువత దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలని, దానిని కోట్లాది మంది పీడిత ప్రజలకు తెలియజేయాలన్నారు. పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాద దోపిడీని అంతం చేయడానికి సోషలిస్ట్ విప్లంవం అనివార్యమన్నారు. భగత్‌సింగ్ తన ప్రాణాలను అర్పించి 94 ఏళ్లు గడిచాయి. ఆయన సోషలిస్ట్ భారతదేశం కల ఇంకా నెరవేరలేదు. ప్రతి రోజూ, మన దేశంలో 7,000 మందికి పైగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారన్నారు. విద్య, ఆరోగ్యం వ్యాపారమయం అయ్యాయన్నారు. నిరుద్యోగుల భారీ సైన్యం సృష్టి అవుతోందన్నారు. ప్రతి రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ఒక వైపు ఒక్క పూట భోజనానికి కూడా నోచుకోలేని పేదలున్నారు. మరో వైపు కొంత మంది పెట్టుబడిదారులు మొత్తం దేశంలోని 70 శాతం ఆస్తిని కలిగి ఉన్నారన్నారు. ఇంత తీవ్రమైన ఆర్థిక అసమానత ఉంది. ఈ సమస్యలన్నింటిని తొలగించడానికి, భగత్‌సింగ్ కలలు కన్న సోషలిస్ట్ భారతదేశ నిర్మాణానికి విద్యార్థులు, యువత ముందుకు వచ్చి భగత్‌సింగ్ కన్న కలను నిజం చేయాలన్నారు. సంఘం కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.