గోదావరిలో మునిగి మృతి | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో మునిగి మృతి

Oct 24 2026 12:28 AM | Updated on Oct 24 2026 12:28 AM

● రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదం ● స్కూటీపై వెళ్తుండగా దంపతులకు గాయాలు ● చికిత్స పొందుతూ ఏఎన్‌ఎం భర్త మృతి

గోదావరిఖని: గోదావరి నది స మ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద శుక్రవారం స్నేహితులతో సరదాగా ఈతకని వెళ్లి మేదరిబస్తీ కి చెందిన గోపి పవన్‌ (34) మృతి చెందాడు. తిలక్‌నగర్‌కు చెందిన(ప్రస్తుతం మేదరిబస్తీలో నివాసం) గోపిపవన్‌ ప్రైవేట్‌ డ్రైవర్‌. తన స్నేహితులైన కుంభాల సందీప్‌, బోరం రంజిత్‌, తుంగపల్లి సాయికుమార్‌తో కలిసి శుక్రవారం గోదావరినదికి వెళ్లి మద్యం తాగారు. అనంతరం సాయికుమార్‌, సందీప్‌ కలిసి గోపిపవన్‌ ఈత కొట్టేందుకు గోదావరినదిలోకి దిగారు. ఈతరాకపోవటంతో గోపిపవన్‌ నదిలో మునగగా సాయికుమార్‌, రంజిత్‌ నీటినుంచి పైకి తీశారు. అనంతరం రంజిత్‌ సీపీఆర్‌ చేయగా అప్పటికే గోపిపవన్‌ మృతి చెందాడు. మృతుడికి ఆరె నెలల క్రితమే భార్యతో విడాకులయ్యాయి. మృతుడి తల్లి గోపి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు వన్‌ టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసుకొన్నారు.

తొలితరం క్రికెటర్‌ ప్రతాప్‌ ఇకలేరు

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో తొలితరం క్రికెటర్‌, సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి జాలి ప్రతాప్‌(67) అనారోగ్యంతో హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని స్థానిక సీహెచ్‌పీకాలనీలో సింగరేణి క్వార్టర్‌లో వద్ద భద్రపరిచారు. ఆయన కుమారుడు అమెరికా నుంచి శనివారం చేరుకోగానే అదేరోజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. క్రికెటర్‌గా, డాన్సర్‌గా గోదావరిఖని ప్రజలకు ప్రతాప్‌ సుపరిచితుడు. ఆయన మృతిపై ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ కె.స్వామి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గుమ్మడి కుమారస్వామి, టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తి, సింగరేణి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవ సలహాదారు పులిమోహన్‌, గోదావరి బ్లుస్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, కోచ్‌ డి.కిరణ్‌కుమార్‌, నాయకుడు ముక్క సుదర్శన్‌, ప్రజానాట్యమండలి జాతీయ ఉపాధ్యక్షుడు కన్నం లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు.

ఏఎన్‌ఎం కుటుంబంలో విషాదం

చొప్పదండి: మండలంలోని గుమ్లాపూర్‌ ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న ఎరవేని లలిత కుటుంబంలో విషాదం నెలకొంది. గత ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దంపతుల్లో చికిత్స పొందుతూ లలిత భర్త ధర్మేందర్‌ మృతి చెందాడు. సుమారు రెండు నెలల పాటు వైద్యం పొందినా కుటుంబ పెద్దను కోల్పోవాల్సి వచ్చింది. అగస్టు 21న చొప్పదండి శివారులోని గుమ్లాపూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద లలిత దంపతులు వెళ్తున్న స్కూటీని కరీంనగర్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లా వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. లలిత ఆమె భర్త ధర్మేందర్‌ తీవ్రంగా గాయపడ్డారు. నెలరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ధర్మేందర్‌ను ఇంటికి తీసుకొచ్చారు. బ్రీతింగ్‌ సమస్యతో కరీంనగర్‌లోని వారి ఇంట్లో మృతి చెందాడు.

‘హలో శ్రీనివాస్‌ చలో కోరుట్ల’ కు ఏర్పాట్లు పూర్తి

కోరుట్ల: పట్టణంలో శ్రీనివాసుల సేవా సంస్థ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించే ‘హలో శ్రీనివాస్‌ చలో కోరుట్ల’ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయినట్టు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వూట్కూరి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. మెట్‌పల్లి రోడ్డులోని జీఎస్‌ గార్డెన్స్‌లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మూడేళ్లుగా తలసేమియా బాధితుల కోసం రక్త సహాయం, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటటం, సీడ్‌ బాల్స్‌ తయారీ, విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో సేవా భావం, సామాజిక చైతన్యం తీసుకవస్తున్నామన్నారు. గతేడాది ప్రపంచ రికార్డు సాధించడం సంస్థకు గర్వ కారణం అని వివరించారు. హలో శ్రీనివాస్‌ చలో కోరుట్ల కార్యక్రమానికి తెలంగాణాలోని వివిధ జిల్లాల నుంచి శ్రీనివాస నామధేయులు తరలిరావాలని, ఒక్కో శ్రీనివాస మిత్రుడు ఇద్దరు చొప్పున తీసుకవచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాని కోరారు. ప్రతినిధులు నీలి శ్రీనివాస్‌, శ్రీరాముల శ్రీనివాస్‌, బెజ్జారపు శ్రీనివాస్‌, తూం శ్రీనివాస్‌, చిలుక శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement